భూ సేకరణ విరమించుకోవాలి
మడకశిర రూరల్: ‘‘పరిశ్రమల కోసం ఇప్పటికే 15 ఏళ్ల క్రితం గౌడనహళ్లి పంచాయతీ పరిధిలో 800 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పరిశ్రమల పేరు చెప్పి గౌడనహళ్లి, తురుకువాండ్ల పల్లి, జమ్మానిపల్లి గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాలు సేకరిస్తామంటున్నారు. పరిశ్రమలు కావాల్సిందే... కానీ అందుకు మా కడుపు కొట్టొద్దు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని వాళ్లం. మా భూములు తీసుకుంటే మేమెట్టా బతికేది. ఇప్పటికై నా భూసేకరణను విరమించుకోవాలి. లేదంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం’’ అంటూ మండల పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గౌడనహళ్లి, తురుకువాండ్ల పల్లి, జమ్మానిపల్లి గ్రామాల పరిధిలో ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం 2 వేల ఎకరాల భూసేకరణను సిద్ధమైంది. దీంతో రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అప్పులు చేసి బోర్లు వేసి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ భూములను తీసుకుంటే మూడు గ్రామాల్లోని చిన్న, సన్న కారు రైతులు దాదాపు 400 మంది వరకు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు అన్యాయం చేయవద్దన్నారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ తెలిపారు.