అడవికి నిప్పు.. భవితకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

అడవికి నిప్పు.. భవితకు ముప్పు

Published Fri, Mar 21 2025 1:41 AM | Last Updated on Fri, Mar 21 2025 1:35 AM

అడవిక

అడవికి నిప్పు.. భవితకు ముప్పు

పెనుకొండ: నిన్నా.. మొన్నటి వరకూ పర్యావరణ ప్రియులను, ప్రజలను ఎంతో ఆకట్టుకున్న పెనుకొండ అటవీ ప్రాంతంలోని పచ్చదనం నేడు కనుమరుగైంది. పర్యావరణ విద్వేషకుల చేతిలో నిలువునా కాలిపోయింది. ఏటా ఇది ప్రహసంగా మారుతున్నా... ముందస్తు చర్యలు చేపట్టడంలో అటవీ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాలుతున్న చెట్లు..

పెనుకొండ అటవీ రేంజ్‌ పరిధిలో 20 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎటు చూసినా కొండ గుట్టలు, మైదాన ప్రాంతాలలో పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుండేవి. జూన్‌లో కురిసిన వర్షాలకు నిండుకున్న పచ్చదనం ఫిబ్రవరి మొదటి వారం వరకూ నేత్రానందం కలిగిస్తుంటుంది. ఆ తర్వాత వేసవి నేపథ్యంలో భూమిపై పరుచుకున్న గడ్డి ఎండిపోతోంది. ఇలాంటి తరుణంలో కొందరు స్వార్థపరులు నిప్పు రాజేయడంతో మంటలు చుట్టుముట్టి అటవీ ప్రాంతం బుగ్గవుతోంది. పచ్చని చెట్లతో పాటు వన్యప్రాణులూ సజీవ దహనమైపోతున్నాయి.

కనిపించని ముందస్తు చర్యలు..

గతంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకునేవారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతంలో ట్రెంచ్‌లు, ఫైర్‌ బ్రేక్‌లు ఏర్పాటు చేసేవారు. అలాగే ఎక్కడికక్కడ వాచర్లను నియమించి అటవీ ప్రాంతం సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం ఈ చర్యలు కనిపించడం లేదు. ఫైర్‌బ్రేక్‌లు, వాచర్లు మచ్చుకై నా కనిపించడం లేదు. దీంతో కొందరు ఆకతాయిల చేష్టలకు విలువైన అటవీ సంపద బుగ్గవుతోంది. అటవీ ప్రాంతంలో నిప్పు రాజేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోనూ అధికారిక వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఫిబ్రవరి ఆరంభం నుంచే గ్రామాల్లో సదస్సులు నిర్వహించేవారు. కళాజాతాలతో ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేవారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

కనుమరుగవుతున్న పచ్చదనం

పర్యావరణ మనుగడ ప్రశ్నార్థకం

పర్యావరణ మనుగడకు ముప్పు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అడవులకు, కొండ గుట్టలకు నిప్పు పెట్టడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వేసవి వస్తే చాలు నిప్పుపెట్టడాన్ని ఓ సంప్రదాయంగా మార్చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అడవులు అంతరించి జంతువులు జనావాసాల్లోకి చొరబడే ప్రమాదముంది. అసలే రాయలసీమలో వర్షపాతం తక్కువ. అడవులను కాపాడుకోకుంటూ పర్యావరణ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయంగా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నాం.

– జె.ప్రతాపరెడ్డి, పర్యావరణ పరిరక్షణ

నాయకులు, పెనుకొండ

No comments yet. Be the first to comment!
Add a comment
అడవికి నిప్పు.. భవితకు ముప్పు 1
1/1

అడవికి నిప్పు.. భవితకు ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement