
విస్తరిస్తున్న క్షయ
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో క్షయ వ్యాధి నానాటికీ విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సకాలంలో చికిత్స చేయించుకోకపోవడం, పాజిటివ్‌గా నిర్ధారణ అయినా మందులు సక్రమంగా వాడకపోవడం వంటి కారణాలతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాలో ఏటా వేల మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా వైద్యాధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులతో పోలిస్తే క్షయ చాలా ప్రమాదకారి వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. ఆరంభంలోనే గుర్తించి మందులు సక్రమంగా వాడితే నివారణ సాధ్యమని, లేకపోతే ప్రాణాపాయం తప్పందని హెచ్చరిస్తున్నారు.
గాలి ద్వారా సులువుగా..
‘మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్’ బ్యాక్టీరియా ద్వారా క్షయ వ్యాధి సోకుతుందని నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సంక్రమిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వేగంగా విస్తరిస్తుంది. రోగి దగ్గినప్పుడు, ఉమ్మిప్పుడు, చీదినప్పుడు రోగకారక క్రిములు గాలిలోకి చేరుతాయి. తద్వారా మరొకరి శరీరంలోకి ప్రవేశిస్తాయి. క్షయ రోగి ఓసారి దగ్గితే సుమారు 40 వేల వరకు వ్యాధికారక క్రిములు గాల్లో కలుస్తాయి. ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతోందని వైద్యులు అంటున్నారు.
ముంచుతోన్న నిర్లక్ష్యం
క్షయ వ్యాధిలో వివిధ రకాలు ఉన్నాయి. టీబీ సోకితే ఆరు నెలల మందులు వాడితే సరిపోతుంది. ఎండీఆర్ సోకితే దీర్ఘకాలంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఎక్స్‌డీఆర్ సోకిన వారు ఆస్పత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలోనే చికిత్స పొందాల్సి ఉంటుంది. ఈ విషయంగా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నేలకోట, నేలకోటతండా, పోతులనాగేపల్లి, ఉప్పనేసినపల్లి, టేకులోడు, బ్రాహ్మణపల్లి, మండ్లి, పందిపర్తి, మొలకవేముల, ఒడ్డుకిందతండా, తురకలాపట్నం, మదిరేబైలుతండా, ఇరగంపల్లి, గోపేపల్లి, మసకవంకపల్లి, పులగంపల్లి, వేళ్లమద్ది, తిప్పేపల్లి, అమగొండపాలెం, పైపల్లి గ్రామాలు క్షయ రహితంగా అధికారులు గుర్తించారు. వ్యాధి నివారణకు ఎనిమిది ప్రాంతాల్లో వ్యాధి నివారణ యూనిట్లు ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి వెళ్తే మందులు ఉచితంగా అందిస్తారు. సకాలంలో డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడితే వ్యాధి నియంత్రణలోనే ఉంటుంది.
ఏడాదిలో తేలిన 2,119 పాజిటివ్ కేసులు
జిల్లా వ్యాప్తంగా 8 చోట్ల యూనిట్లు
నేడు ప్రపంచ క్షయ దినోత్సవం
సందర్భం :
క్షయ వ్యాధి లక్షణాలు
రెండు వారాల పాటు క్రమం తగ్గని దగ్గు
రెండు వారాలకు మించి జ్వరం
తెలియకుండా బరువు తగ్గిపోవడం
రాత్రిపూట చెమటలు పట్టడం

విస్తరిస్తున్న క్షయ

విస్తరిస్తున్న క్షయ

విస్తరిస్తున్న క్షయ
Comments
Please login to add a commentAdd a comment