ఇసుక దోపిడీ అడ్డగింత
గోరంట్ల: బూదిలి సమీపాన చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం మాటున కాంట్రాక్టర్ ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. హిటాచీలు పెట్టి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆదివారం సాయంత్రం బూదిలి సర్పంచ్ రామాంజనేయులు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులరెడ్డి, బూదిలి, పాపిరెడ్డిపల్లి, గొల్లపల్లి, గంగాదేపల్లి గ్రామాల చిత్రావతి పరివాహక ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పేరిట అవసరానికి మించి ఎందుకు ఇసుక తవ్వి డంప్ చేస్తున్నారని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. ఒక వేళ చిత్రావతి నది నుంచి ఇసుక తవ్వకం, తరలింపునకు అనుమతులు తీసుకుంటే పత్రాలు చూపాలని డిమాండ్ చేశారు. దీనికి కాంట్రాక్టర్ తరఫు నుంచి సరైన సమాధానం రాలేదు. ఇక్కడ తవ్విన ఇసుకను బ్రిడ్జి కోసం కాకుండా ఇతర పనుల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. చిత్రావతి నదిలోని ఫిల్టర్ బోరుబావుల కింద వందలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకున్నామని, ఇసుకను ఎడాపెడా తవ్వేస్తే భూగర్భజలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వే క్రమంలో ఫిల్టర్ బోర్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇసుక దోపిడీ అడ్డగింత
Comments
Please login to add a commentAdd a comment