● నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలి
● పెట్రోల్ బంకును తనిఖీ చేసిన ఆర్డీఓ, డీఎస్‌ఓ
ధర్మవరం అర్బన్: చమురు కొలతల్లో తేడాలుంటే చర్యలు తప్పవని ఆర్డీఓ మహేష్, డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి హెచ్చరించారు. వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలన్నారు. బుధవారం వారు పట్టణంలోని దుర్గమ్మ ఆలయం వెనుకవైపు ఉన్న భారత్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులోని రికార్డులు పరిశీలించారు. రోజువారీ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయలేదని గుర్తించారు. స్టాకు విక్రయానికి, మిగిలిన స్టాకు సరిగ్గా రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పెట్రోలు బంకులో తాగునీరు సదుపాయం, గాలిపంపు లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో పెట్రోల్ బంకు నిర్వాహకులను మందలించారు. అగ్నిమాపక పరికరాలన్ని మూలన పెట్టడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్ రీడింగ్, ట్యాంకు రీడింగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ కల్తీ ఉందా లేదా అని ఫిల్టర్ పేపర్ ద్వారా పరిశీలించారు. మరోసారి తనిఖీకి వచ్చే సమయానికి రికార్డులన్ని కరెక్ట్‌గా ఉండాలని ఆదేశించారు. తనిఖీల్లో సీఎస్‌డీటీ సురేంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.