
అధికారం కోసం అడ్డదారులు
సాక్షి, పుట్టపర్తి
ప్రజా క్షేత్రంలో ఓడినా.. అడ్డదారిలో మున్సిపాలిటీల్లో పెత్తనం చెలాయించాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. ప్రత్యర్థి పార్టీ తరఫున గెలిచిన వారిని బెదిరిస్తూ.. పదవులు ఆఫర్ చేస్తూ.. పచ్చ కండువా కప్పేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. అడ్డదారుల్లో అధికారం చేపట్టేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హిందూపురం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవలే కదిరి మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకునే క్రమంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తాజాగా మడకశిర మున్సిపల్ సీటును సైతం దక్కించుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేసున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నేడో, రేపో బల పరీక్షకు రంగం సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలోని ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా టీడీపీకి రెండంకెల సంఖ్య సీట్లు లేవు. ప్రతి మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. హిందూపురంలో 38 సీట్లకు గానూ ఆరు, మడకశిరలో 20 సీట్లలో ఐదు, కదిరిలో 36 స్థానాల్లో ఐదు చోట్ల టీడీపీ గెలిచింది. పుట్టపర్తిలో 20 వార్డులకు గానూ 6 చోట్ల, పెనుకొండలో 20 సీట్లకు గానూ రెండు చోట్ల, ధర్మవరంలో 40 స్థానాలకు గానూ టీడీపీ బోణీ కూడా కొట్టలేదు. కానీ అడ్డదారిలో ఇప్పటికే హిందూపురం పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. కదిరిలో పాగా వేసేందుకు ప్లాన్ కుదిరింది. మడకశిర సీటును సాధించేందుకు కుట్ర జరుగుతోంది.
హిందూపురం మున్సిపాలిటీలో 38 స్థానాలకు వైఎస్సార్‌సీపీ 29 చోట్ల, టీడీపీ 6 చోట్ల, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 చోట గెలిచారు. మున్సిపల్ పీఠం కై వసం చేసుకోవాలంటే.. కనీసం 20 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే వైఎస్సార్‌సీపీ నుంచి 13 మందిని ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకున్నారు. అప్రజాస్వామికంగా ఎన్నిక జరిగి మున్సిపల్ చైర్మన్ సీటును టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీ మహిళకు అవకాశం ఇవ్వగా.. ప్రస్తుత కూటమి సర్కారు పురుషుడికి పెత్తనం కట్టింది. పార్టీ ఫిరాయించిన వారిని ఇప్పుడు కూరలో కరివేపాకులా పక్కన పడేసింది.
కదిరి మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 30 చోట్ల గెలవగా.. టీడీపీ కేవలం 5 స్థానాలు మాత్రమే సాధించింది. మరో స్థానంలో రెబల్ అభ్యర్థి గెలిచారు. కాగా ఇటీవల కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ సభ్యులను బెదిరించి.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తమకు మద్దతు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారని బెదిరించడంతో చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా 25 మంది చేతులెత్తారు. దీంతో చైర్‌పర్సన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. త్వరలోనే ఎన్నిక నిర్వహించి కొత్త చైర్మన్ ఎన్నుకోనున్నారు.
టీడీపీ ఫిరాయింపు
రాజకీయం
మున్సిపాలిటీల్లో పెత్తనం కోసం బరితెగింపు
ఇప్పటికే అడ్డదారిలో హిందూపురం మున్సిపాలిటీ కై వసం
తాజాగా కదిరి మున్సిపల్
చైర్ పర్సన్‌పై అవిశ్వాసం
ఒకట్రెండు రోజుల్లో మడకశిర పీఠంపై కూటమి కుట్రలు
బలం లేకున్నా.. బలవంతంగా ఫిరాయింపు రాజకీయం
కేసుల పేరుతో భయపెట్టి టీడీపీ కండువా కప్పుతున్న వైనం
మెజారిటీ సీట్లు రాకున్నా..
జిల్లాలో హిందూపురం, కదిరి, ధర్మవరం, మడకశిర, పుట్టపర్తి, పెనుకొండ మున్సిపాలిటీలుండగా... 2021లో జరిగిన ‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీ ఏ ఒక్క చోట కూడా అధికారం చేపట్టలేకపోయింది. ఆరు మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగహించడంతో ఆ పార్టీ అభ్యర్థులే చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు అడ్డదారిలో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ సభ్యులను కేసుల పేరుతో బెదిరిస్తూ.. పార్టీ మారేలా చేశారు. అనంతరం అధికారులను అడ్డు పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. సంతకాలు సేకరించి.. పీఠం కై వసం చేసుకుంటున్నారు.
‘పురం’లో ఆరు సీట్లు గెలిచి..
కదిరిలో ఐదు సీట్లు గెలిచి..
సింగిల్ డిజిట్‌కే పరిమితం