పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం
ఎన్‌పీకుంట/గాండ్లపెంట: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని, ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఫైరోజాబేగం సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిర్దిష్ట సమయంలో తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయాలన్నారు. బుధవారం ఆమె ఎన్‌పీకుంట, గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పీహెచ్‌సీల్లోని రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. పీహెచ్‌సీల్లోని ల్యాబ్ గదులను, కాన్పుల గదులను తనిఖీ చేశారు. ఎన్‌పీకుంటలో వ్యాక్సిన్ వేసే సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదు వస్తున్నాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ వెంట అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మేనాయక్, వైద్యాధికారులు డాక్టర్ ఆనంద్‌వర్దన్, మహేశ్వరమారుతి, సీహెచ్‌ఓ నాగలక్ష్మి ఉన్నారు. అంతకుముందు ఎన్‌పీకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేస్తున్న సమయంలో తలకు తీవ్ర గాయమై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం స్వయంగా చికిత్స చేశారు.