రామగిరిలో రౌడీరాజ్యం | - | Sakshi
Sakshi News home page

రామగిరిలో రౌడీరాజ్యం

Published Thu, Mar 27 2025 12:39 AM | Last Updated on Thu, Mar 27 2025 12:41 AM

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

సాక్షి, పుట్టపర్తి : మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు రెచ్చిపోయారు. ‘రామగిరి అంటే రౌడీ రాజ్యం.. పరిటాల రాజ్యాంగం అమల్లో ఉంటుంది’ అన్న రీతిలో కల్లోలం సృష్టించారు. నేడు (మార్చి 27) జరగబోయే రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అనెక్సర్‌ 1, 2 ఇచ్చేందుకు బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీకి చెందిన న్యాయవాది కురుబ నాగిరెడ్డి, రాప్తాడు వైస్‌ ఎంపీపీ బోయ రామాంజనేయులు, పార్టీ వలంటీర్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డిపై టీడీపీ అల్లరిమూకలు దాడికి దిగాయి. రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోగానే.. పక్కా ప్రణాళికతో కొందరు గుంపుగా వచ్చి భౌతికదాడికి దిగారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి తోసుకెళ్లి బంధించారు. లోపల ఎంపీడీఓను సైతం చితకబాదినట్లు సమాచారం. అనెక్సర్‌ 1, 2 పత్రాలను చించేశారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతల వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. వాహనాల్లోకి మారణాయుధాలు విసిరి.. అక్రమ కేసులు బనాయించాలనే యత్నం చేశారు. అనంతరం పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ దాడి చేసిన వారిని వదిలేసి..అనుమతి లేనిదే ఎందుకొచ్చారంటూ బాధితులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ రత్న రామగిరికి చేరుకుని..విచారణ చేపట్టారు.

మెజార్టీ లేకపోయినా..

రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా... నసనకోట మినహా తొమ్మిదింట (పేరూరు–1, పేరూరు–2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, పోలేపల్లి, గంతిమర్రి, మాదాపురం, కుంటిమద్ది) వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలిచాడు. రామగిరి ఎంపీపీ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన మీనుగ నాగమ్మ ఆ పదవిలో కొనసాగారు. అయితే..ఆమె ఈ ఏడాది జనవరిలో అకాల మరణంతో ప్రస్తుతం ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. మండలంలో ఐదుగురు మహిళా ఎంపీటీసీ సభ్యులుండగా.. అందరూ వైఎస్సార్‌సీపీ వారే. అయినప్పటికీ ఎంపీపీ పదవిని టీడీపీ పరం చేయాలని పరిటాల సునీత తాపత్రయ పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

అక్రమ కేసులు.. అరెస్టులకు ప్లాన్‌

అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి.. అరెస్టు చేయించాలని టీడీపీ నేతలు ప్లాన్‌ వేసినట్లు బుధవారం రామగిరి ఘటనా దృశ్యాలను బట్టి స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలను ఎంపీడీఓ కార్యాలయంలో బంధించి.. బయట ఉన్న వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాటిలోకి మారణాయుధాలు చేర్చడం అనుమానాలకు తావిస్తోంది.

‘తోపుదుర్తి’ని అడ్డగించిన పోలీసులు..

వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి సమాచారం అందుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రామగిరి బయలుదేరారు. అయితే..మార్గ మధ్యంలో సోమందేపల్లి క్రాస్‌ వద్ద పెనుకొండ డీఎస్పీ వై.వెంకటేశ్వర్లు అడ్డుకుని సోమందేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మూడు గంటల సేపు స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న ఉషశ్రీచరణ్‌ అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వాదం చేశారు.

ప్రశాంతి నిలయం/సోమందేపల్లి: గాండ్లపెంట, రామగిరి, రొద్దం ఎంపీపీ స్థానాలకు గురువారం నిర్వహించనున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె పార్టీ శ్రేణులలో కలసి కలెక్టరేట్‌కు విచ్చేసి జేసీని ఆయన చాంబర్‌లో కలసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె పుట్టపర్తిలో, సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎంపీపీ ఎన్నికలు జరగనున్న మూడుచోట్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, కూటమి పార్టీలకు ఒక్క చోట కూడా అవకాశం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఆ స్థానాలన్నీ వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంటుందన్నారు. దీంతో దొడ్డిదాడిలో ఎంపీపీ పీఠాలు దక్కించుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ నేతలు జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్‌కు ఊపిరి పోస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలంలో టీడీపీ నాయకులు అల్లర్లు సృష్టించి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిస్థితిని సమీక్షించడానికి వెళ్తున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే న్యాయ స్థానం ముందు నిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి పార్టీల నాయకులు, ఎమ్మెల్యేల కుట్రలను చట్టపరిధిలో ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు పార్టీ బలపరచిన అభ్యర్థికి మద్దతు తెలిపి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆమె కోరారు.

ఎంపీపీ పదవి ఆశించడం హాస్యాస్పదం

తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలకు గానూ ప్రజలు కేవలం ఒక్క సీటు మాత్రమే టీడీపీకి ఇచ్చారు. అయినా ఎంపీపీ పదవి ఆశించడం హాస్యాస్పదం. ప్రజాక్షేత్రంలో గెలవడం చేతకాక.. దొడ్డిదారిలో పదవులు కావాలనే ఆశ ఎందుకు? మెజారిటీ సీట్లు లేనప్పుడు ఎన్నికలకు రావడమే అనవసరం. ప్రత్యర్థి పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేయడం రాజకీయం కాదు. ఎస్పీ నిష్పక్షపాతంగా పని చేస్తారనే నమ్మకం ఉన్నప్పటికీ రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ మాత్రం పూర్తిగా పరిటాల సునీత కనుసన్నల్లోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. రామగిరి వెళ్లాల్సిన ప్రతిసారీ పోలీసుల అనుమతి తీసుకోవాలని ఏ రాజ్యాంగంలోనూ లేదు. రామగిరి మండలం పాకిస్తాన్‌లో లేదు కదా?! ప్రశాంతంగా ఉండే ప్రాంతాలను దోపిడీ, రౌడీరాజ్యంగా మార్చడమే పరిటాల కుటుంబం పని. ఎంపీటీసీ సభ్యుల పిటిషన్‌ మేరకు ఎన్నిక పూర్తయ్యే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి. ఎంపీపీ ఎన్నికతో పరిటాల సునీతకు ఏం అవసరం ఉంది? మహిళా అభ్యర్థులు టీడీపీలో లేరు. ఎన్నికల హాలులో కూర్చుని వెళ్లకుండా.. కొట్లాట, గలాట ఎందుకు? గతంలో సునీత మంత్రిగా ఉన్న సమయంలోనూ కనగానపల్లి ఎంపీపీ ఎన్నిక విషయంలో ఇద్దరు మహిళా సభ్యులపై చేయి చేసుకున్న ఘటన అందరికీ గుర్తుంది. ఎంపీపీ పదవి కోసం వీధికెక్కుతోన్న పరిటాల సునీతను చంద్రబాబు నియంత్రించాలి.

రెచ్చిపోయిన పరిటాల అనుచరులు

వైఎస్సార్‌సీపీ నాయకులు,

ఎంపీడీఓపై దాడి

వాహనాల అద్దాలు ధ్వంసం

ఎంపీపీ ఎన్నికను

కల్లోలం చేయాలని కుట్రలు

‘పరిటాల’ రాజ్యాంగం అమలు చేస్తున్న సునీత

జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం

అందజేసిన ఉషశ్రీ చరణ్‌

పీఠాలు దక్కించుకునేందుకు

కుట్రలు చేస్తున్నారని మండిపాటు

రామగిరిలో రౌడీరాజ్యం1
1/3

రామగిరిలో రౌడీరాజ్యం

రామగిరిలో రౌడీరాజ్యం2
2/3

రామగిరిలో రౌడీరాజ్యం

రామగిరిలో రౌడీరాజ్యం3
3/3

రామగిరిలో రౌడీరాజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement