బలం లేకున్నా.. బరితెగింపు
సాక్షి, పుట్టపర్తి
ప్రజా క్షేత్రంలో ఓడిపోయినా.. అధికార బలంతో పదవులు దక్కించుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగానే దౌర్జన్యాలకు దిగుతూ.. బెదిరింపు రాజకీయాలకు తెరలేపారు. జిల్లాలో రామగిరి, గాండ్లపెంట, రొద్దం మండలాల పరిషత్ అధ్యక్షులకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఏ మండలంలోనూ టీడీపీకి మెజారిటీ లేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున టీడీపీ మూడు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అయితే వివిధ కారణాలతో ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగనుండటంతో పీఠం కోసం కూటమి పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చెప్పిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు వెళ్లినట్లు తెలిసింది. రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు, కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వర్గీయులు, పెనుకొండలో మంత్రి సవిత వర్గం.. ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ సభ్యులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అయితే ఏ ఒక్క మండలంలో కూడా టీడీపీ గెలిచేందుకు సరిపడా సంఖ్యాబలం లేదు. దీంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయించి మరో ఆరు నెలల పాటు ఎంపీపీ పదవి ఎవరికీ లేకుండా చేయాలని కూటమి పార్టీల నేతలు కుట్రలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎంపీపీ ఎన్నికకు హాజరు కావొద్దని ఎంపీటీసీ సభ్యులకు వార్నింగ్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులంతా పార్టీ క్రమశిక్షణకు లోబడి ఎన్నికల్లో పాల్గొనేందుకు సంసిద్ధమయ్యారు.
మండలానికి ఒక సీటు కూడా లేదాయె..
రామగిరిలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. మిగతా 9 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించి ఎంపీపీ పీఠం కై వసం చేసుకుంది. అయితే రామగిరి ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక రొద్దం మండలంలో 15 స్థానాలకు గానూ టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. రొద్దం ఎంపీపీగా ఉన్న చంద్రశేఖర్ అకాల మరణంతో అక్కడ ఎన్నిక జరగనుంది. గాండ్లపెంట మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీడీపీ ఒక్క చోట మాత్రమే గెలిచింది. ఎంపీపీగా ఉన్న జగన్‌మోహన్ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ సంఖ్యా బలం ఐదుగా ఉంది.
రామగిరిలో ఒక్క సీటుతో రాజకీయం..
రామగిరిలో పది సీట్లకు గానూ టీడీపీ ఒక్కచోటే గెలిచింది. రామగిరి ఎంపీపీ జనరల్ మహిళకు రిజర్వు చేశారు. టీడీపీ తరఫున మహిళలు గెలవలేదు. అయినా.. ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని దాడులకు తెగబడుతున్నారు.
రొద్దంలో వైఎస్సార్‌సీపీకే మళ్లీ పట్టం!
మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం ఎంపీపీ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 15 స్థానాలనూ వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల ఓ సభ్యుడు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించాడు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
గాండ్లపెంట్లలో ఫిరాయింపు కుట్రలు..
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నేతృత్వంలో గాండ్లపెంట ఎంపీపీ పదవి చేజిక్కించునేందుకు ఫిరాయింపు కుట్రలు చేస్తున్నారు. ఈ స్థానం జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒకరు మాత్రమే గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి ఒకరు ఫిరాయించారు. దీంతో మిగతా ఐదుగురి మద్దతుతో మరోసారి మండల పరిషత్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు హాజరు కాకుండా కట్టడి చేసి ఎన్నికను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనుచరులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.
ఎంపీపీ స్థానాల కోసం
కూటమి సర్కారు కుట్ర
మెజారిటీ లేకున్నా
ఫిరాయింపులకు ప్రోత్సాహం
ఒక్క సీటు ఉన్న చోటా పీఠం కోసం
తీవ్ర యత్నం
రిజర్వేషన్ కేటగిరీ సభ్యులు లేకున్నా తాపత్రయం
నేడు రామగిరి, గాండ్లపెంట,
రొద్దం ఎంపీపీ ఎన్నికలు