మూగజీవి ఆరోగ్యానికి ముప్పు! | - | Sakshi
Sakshi News home page

మూగజీవి ఆరోగ్యానికి ముప్పు!

Published Tue, Mar 25 2025 2:00 AM | Last Updated on Tue, Mar 25 2025 1:54 AM

త్వరలోనే సేవల పునరుద్ధరణ

ప్రస్తుతం జిల్లాలోని ఆరు సంచార పశు ఆరోగ్య వాహనాలు నిలిచాయి. ఈ వాహనాల బాధ్యతలను కొత్త సంస్థకు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం సేవలను నిలుపుదల చేసింది. పూర్తి స్థాయిలో అగ్రిమెంట్‌, టెండర్‌ పూర్తయ్యాక వాహన సేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే సంచార పశువైద్య సేవలు పునరుద్ధరిస్తాం. – శుభదాస్‌, పశుశాఖ జేడీ

రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు

జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులపై ఆధారపడి బతుకుతున్నారు. అలాగే గొర్రలపై ఆధారపడి కాపర్లు జీవిస్తున్నారు. మూగజీవాలకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా రైతులు, కాపర్లు తీవ్ర ఇబ్బందులు పడతారు. అత్యవసర సమయంలో వైద్యం అందక పోతే రూ.లక్షలు నష్టపోతాం. అందువల్ల ప్రభుత్వం వెంటనే సంచార పశువైద్య సేవలందించే వాహనాలు అందుబాటులోకి తేవాలి.

– రామన్న, పైడేటి, పరిగి మండలం

రాత్రికి రాత్రే తొలగింపు ఉత్తర్వులు

సంచార పశు ఆరోగ్య వాహనంలో సేవలు అందించే ఉద్యోగులను ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. పశువులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయంటూ ప్రతి రోజూ రైతుల నుంచి ఫోన్లు వస్తున్నా...మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుంటేనే రైతులకు, జీవాల కాపర్లు మేలు జరుగుతుంది.

– పవన్‌, సంచార పశు ఆరోగ్య ఉద్యోగి

● పెనుకొండ మండలం మావటూరుకు చెందిన మల్లికార్జున ఎద్దులపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓ ఎద్దు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈనెల 15న సంచార పశువైద్యసేవల కోసం డయల్‌ 1962కు ఫోన్‌ చేశాడు. అదిగో..ఇదిగో అని చెప్పిన సిబ్బంది ఆ తర్వాత ఫోన్‌ తీయడం మానేశారు. తనకు తెలిసిన వారి ద్వారా సిబ్బంది పర్సనల్‌ నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేయగా..తమను ఉద్యోగాల నుంచి తొలగించారని, సంచార పశువైద్య సేవలు బంద్‌ చేశారని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని మల్లికార్జున రూ.2 వేలు చెల్లించి ప్రైవేటు వాహనంలో హిందూపురం పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించుకున్నాడు.

..ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సంచార పశువైద్యం కోసం ఏర్పాటు చేసిన 1962 నంబర్‌కు ఫోన్‌ చేస్తే సమాధానం చెప్పేవారే లేకుండా పోయారు. జిల్లాలోని 6 వాహనాల్లో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం నెలరోజుల క్రితం తొలగించడంతో పశువైద్యం దైవాదీనంగా మారింది.

పెనుకొండ: పశువులు జబ్బుబారిన పడినా, ప్రమాదాలకు గురైనా ఆస్పత్రుల వరకూ తీసుకువెళ్లేందుకు రైతులకు ఇబ్బందులు లేకుండా గత వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సంచార పశువైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 1962 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు పశువుల అంబులెన్స్‌లో వైద్యుడు, సిబ్బంది ఇంటివద్దకే వచ్చి పశువులకు వైద్యం అందించేవారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరిగేది. కానీ ఇప్పుడా సంచార పశు వైద్య సేవలందించే వాహనాలు నెలరోజుల క్రితం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అత్యవసర వైద్య సేవలు అందక మూగజీవాలు అల్లాడి పోతుంటే రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు..

సంచార పశువైద్య సేవల కోసం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 175, రెండో దశలో మరో 175 సంచార వాహనాలను జగనన్న ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సంచార పశువైద్య బాధ్యతలను జీవికే సంస్థకు అప్పగించింది. దీంతో సదరు సంస్థ ఒక్కో సంచార వైద్యం సేవందించే వాహనంలో వైద్యుడితో పాటు డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌, మరో సహాయకుడి చొప్పున నియమించింది. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిదశలో 13 వాహనాలు అందుబాటులోకి రాగా 39 మందిని నియమించింది. ఇందులో శ్రీసత్యసాయి జిల్లాకు 6 వాహనాలు, 18 మంది సిబ్బందిని కేటాయించారు. దీంతో వారంతా మారుమూల పల్లెలు, పొలాల వద్దకే వెళ్లి పశువులకు వైద్య సేవలు అందించేవారు. అవసరమైతే వాహనంలోనే ఆస్పత్రికి తరలించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పశు సంచార వైద్యసేవల బాధ్యతలను చూస్తున్న జీవీఆర్‌ సంస్థను తొలగించింది. అంతేకాకుండా జిల్లాలోని సంచారవాహనాల్లో పనిచేస్తున్న 18 మంది సిబ్బందిని తొలగిస్తూ ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది. నేటికీ మరో సంస్థకు కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో సంచార వైద్య సేవలు అందక రైతులు, పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు.

నిలిచిన సంచార పశువైద్య వాహనాలు రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు నెలరోజులుగా అందని వైద్య సేవలు

మూగజీవి ఆరోగ్యానికి ముప్పు! 1
1/1

మూగజీవి ఆరోగ్యానికి ముప్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement