తీపి పంచాల్సిన కర్బూజ ఈ సారి రైతన్నలకు చేదు రుచి చూపిస్తోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కాయ నిట్టనిలువునా చీలి పోతోంది. ఫలితంగా పెట్టుబడులు సైతం చేతికి అందక రైతులు కుదేలవుతున్నారు.
పుట్టపర్తి రూరల్: సంప్రదాయ పంటల సాగులో నష్టపోయిన పలువురు రైతులు ఈ సారి మార్పు కోసం కర్బూజ సాగు చేపట్టారు. సరికొత్త ఆశలతో సాగు చేసిన తీగజాతి పంట ఊహించని విధంగా వాతావరణంలో మార్పుల కారణంగా రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. పంట ఏపుగా పెరిగింది... ఆశించిన మేర దిగుబడి ఉంది... అయినా కాయ నిట్టనిలువునా చీలి పోవడంతో కనీస పెట్టుబడులు సైతం చేతికి అందని పరిస్థితి నెలకొంది.
ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి..
కర్బూజ సాగుకు పెట్టుబడి ఎక్కువే అయినా రైతులు వెనుకంజ వేయలేదు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 300 హెక్టార్లలో కర్బూజ సాగులోకి వచ్చింది. సేంద్రియ ఎరువులతో పంట సాగు చేపట్టారు. సేద్యం, సాలు తీత, మల్చింగ్ షీట్, ఎకరాకు 300 గ్రాముల చొప్పున విత్తనాలు, 15వ రోజు నుంచి లీఫ్ మైనర్, దోమ, ఊజీ ఈగ, లద్దె పురుగు, పచ్చపురుగు వంటి కీటకాలతో పాటు వేరుకుళ్లు, బూడిద, ఆకుముడత తెగులు, సస్యరక్షణకు మందుల పిచికారీకి మొత్తం కలిపి ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడులయ్యాయి. మూడు నెలల్లో పంట కాపునకు వచ్చి దాదాపు 10 టన్నుల దిగుబడినిస్తుంది. కాయ నాణ్యత బాగుంటే ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు కచ్చితమైన లాభం ఉంటుందని రైతులు ఆశపడ్డారు.
ఫ్రూట్ సెట్టింగ్‌లో లోపం..
పసి పిల్లల పోషణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో... అన్నే జాగ్రత్తలను కర్బూజ పంట సాగులోనూ రైతులు తీసుకుంటుంటారు. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు పంట తట్టుకోలేక పోయింది. విత్తనం నాటిన 30 నుంచి 40 రోజులలోపే పూత – పిందె (ఫ్రూట్ సెట్టింగ్) జరగాలి. కానీ అలా జరగకపోవడంతో మందుల పిచికారీ, సూక్ష్మపోషకాలు వంటివి మరింతగా డ్రిప్ ద్వారా అందించాల్సి వచ్చింది. దీంతో 40 నుంచి 55 రోజుల వరకు వివిధ దశల్లో ఫ్రూట్ సెట్టింగ్ జరిగింది. పండిన కాయలు ఉరుములు, మెరుపులు, వర్షాల ధాటికి నిలువునా చీలాయి. దీనికి తోడు వాతావరణంలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను కాయలు తట్టుకోలేకపోయాయి. తీగలపైనే చీలిన కాయలు కుళ్లిపోతున్నాయి.
మార్కెటింగ్ సౌకర్యం లేక అవస్థలు..
అసలే పచ్చి సరుకు.. రెండు రోజుల వ్యవధిలోనే విక్రయించుకోవాలి. లేదంటే కర్బూజా రైతుల పరిస్థితి అథోగతే అవుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే కర్బూజా పంటకు బెంగళూరు, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్రల్లో మంచి గిరాకీ ఉంది. స్థానికంగా మార్కెటింగ్ అవకాశం లేకపోవడంతో 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు మార్కెట్‌కు రైతులు తరలిస్తున్నారు. మూడు టన్నుల కాయలను తరలించేందుకు వాహనానికి రూ.7వేల నుంచి రూ.10వేలు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం కిలో ధర మొదటి రకం రూ.40 పలుకుతోంది. మిగిలిన రెండు, మూడవ రకం ధర రూ.10– రూ.20 మధ్యన ఉంటోంది. ఇక ఏజెంట్‌కు 10 శాతం కమీషన్ పోను రైతులకు మిగిలేది అరకొరనే.
నష్టాలతో కుదేలైన కర్బూజ రైతు
దెబ్బతీసిన వాతావరణ మార్పులు
కాయ నిలువునా చీలి.. కుళ్లిపోతున్న వైనం
పెట్టుబడులు సైతం తిరిగిరాని పరిస్థితి
ప్రభుత్వం ఆదుకోవాలి
నేను రెండున్నర ఎకరాల్లో కర్బూజ సాగు చేశాను. పెట్టుబడి రూ.2.5 లక్షలు అయింది. పంట ఏపుగానే పెరిగింది కానీ, కాయలో చీలికలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. చేతికొచ్చిన అరకొర కాయలు అమ్మితే పెట్టుబడి సైతం దక్కడం లేదు. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. కర్బూజా పంటకు స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి.
– కుళ్లాయప్ప, రైతు, ఎనుములపల్లి,
పుట్టపర్తి మండలం
సస్యరక్షణ చేపట్టాలి
వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల కారణంగా కర్బూజ ఫ్రూట్ సెట్టింగ్‌లో తేడాలు వచ్చాయి. కాసిన కాయ చీలిపోతోంది. సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే వీలైనంత వరకు పంటను కాపాడుకోవచ్చు.
– చంద్రశేఖర్, ఉద్యాన శాఖాధికారి
ఊహించని నష్టం
మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని కర్బూజ పెట్టాను. రెండు విడతల్లో మొత్తం పది ఎకరాల్లో సాగు చేశాను. ఐదు ఎకరాల్లో రూ.3లక్షల రాబడి వచ్చింది. మిగిలిన ఐదు ఎకరాల్లో రాబడి చేతికి అందే పరిస్థితి లేదు. వాతావరణ మార్పులతో ఊహించని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. లేకపోతే అప్పుల నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది.
– నంజిరెడ్డి, ఎనుములపల్లి, పుట్టపర్తి మండలం
చేదు మిగిల్చిన తీపి పంట..
చేదు మిగిల్చిన తీపి పంట..
చేదు మిగిల్చిన తీపి పంట..
చేదు మిగిల్చిన తీపి పంట..