దౌర్జన్యం.. దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యం.. దుర్మార్గం

Published Fri, Mar 28 2025 1:17 AM | Last Updated on Fri, Mar 28 2025 1:16 AM

సాక్షి, పుట్టపర్తి/ పెనుకొండ రూరల్‌/ పెనుకొండ: ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక ‘పరిటాల’ కుటుంబం పైశాచిక రాజకీయం చేసింది. రౌడీయిజం చేస్తూ.. దౌర్జన్యకాండ సృష్టించి.. అధికారులను అడ్డు పెట్టుకుని ఎంపీపీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించింది. మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ ఆదేశాలతో రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ తాను ఓ పోలీసు అధికారి అనే విషయం మర్చిపోయారు. పచ్చ కండువా వేసుకున్న కార్యకర్త తరహాలో చక్రం తిప్పడం చర్చనీయాంశమైంది. మొన్నటి వరకూ సెలవులో ఉన్న ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధుల్లో చేరడం పలు అనుమానాలకు తావిస్తోంది. సజావుగా ఎన్నిక జరిగితే ఓడిపోతామని తెలిసే ఎమ్మెల్యే పరిటాల సునీత దిగజారుడు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అధికారులను పావులుగా వాడుకొని దొడ్డిదారిన వైఎస్సార్‌సీపీ సభ్యులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి, పదవులను ఆఫర్‌ చేసి లాక్కోవాలనే ప్రయత్నం చేశారు. ప్లాన్‌ ఫలించకపోయేసరికి ఎన్నికను వాయిదా వేయించారు.

అభ్యర్థి లేకున్నా కక్కుర్తి రాజకీయం..

రామగిరి ఎంపీపీ పదవి మహిళకు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరఫున ఒక్క పురుషుడు మాత్రమే గెలిచారు. పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు కూడా పురుషులే కావడంతో రామగిరి నుంచి టీడీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు కూడా అభ్యర్థి లేరు. అయితే ప్రలోభాలకు గురి చేసి వైఎస్సార్‌సీపీ సభ్యులను లాక్కొని టీడీపీ కండువా వేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని పరిటాల సునీత వేసిన ప్లాన్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయింది. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 9 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. అందులో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ మరణించారు. ఎంపీపీ పదవి దక్కాలంటే కనీసం ఐదుగురు మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున ఐదుగురు సభ్యులు బెంగళూరు క్యాంపులో ఉన్నారు.

కావాలనే కాలయాపన..

వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరుగురు గురువారం బెంగళూరు నుంచి రామగిరికి ఎన్నికల కోసం వస్తుండగా.. బాగేపల్లి టోల్‌ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరి తీసుకెళ్తామని.. మిగతా వాళ్లు రాకూడదని సూచించారు. బాగేపల్లి నుంచి ఏడు వాహనాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులతో రామగిరికి బయలుదేరారు. అయితే కాన్వాయ్‌ చెన్నేకొత్తపల్లి దాటే సమయానికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సమయానికి రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి ముగ్గురు సభ్యులు మాత్రమే చేరుకోవడంతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు గడువు మీరింది. ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంజీవయ్య ప్రకటించారు.

ఎమ్మెల్యేతో వీడియో కాల్స్‌..

రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడినట్లు తెలియడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులను తిరిగి కర్ణాటక సరిహద్దు దాటించే వరకూ బందోబస్తులో ఉండాలి. అయితే ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ కల్పించుకుని వైఎస్సార్‌సీపీ సభ్యులతో వీడియో కాల్స్‌ ద్వారా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో మాట్లాడించారు. పదవులు ఆఫర్‌ చేసి.. డబ్బు ద్వారా ప్రలోభాలకు గురి చేశారు. పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించారు. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులందరూ ఒకే మాటపై నిలబడి.. పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. సీకే పల్లి నుంచి పెనుకొండ వెళ్లే లోపు ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ మూడు వాహనాలు మారడం అనుమానాలకు తావిస్తోంది.

మహిళా ఎంపీటీసీ కిడ్నాప్‌..

లీగల్‌ ప్రొసీజర్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించాలని పోలీసులు సూచించారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన టీడీపీ నేతలు వాహనాల్లో వచ్చి పేరూరు –2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. మహిళా అభ్యర్థి ఉంటే.. నామినేషన్‌ దాఖలు చేసి.. ఏదో విధంగా బెదిరించి పార్టీ మార్చుకోవచ్చనే ఆలోచనతో పరిటాల సునీత ప్లాన్‌ చేసి దళిత మహిళను ఇరకాటంలో పడేశారు.

మాజీ మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్‌ నిరసన..

పోలీసుల తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలసి అంబేడ్కర్‌ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించారు. ఎంపీటీసీ భారతిని పోలీసులు టీడీపి వర్గీయులకు అప్పజెప్పారని, ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కుట్ర అని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పెనుకొండలో మళ్లీ ఫ్యాక్షన్‌ బీజాలు వేస్తున్నారని విమర్శించారు. పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. అనంతరం పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించారు.

ప్రశాంత ప్రాంతాల్లో కల్లోల వాతావరణం..

కొన్నేళ్లుగా ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పెనుకొండలో పరిటాల అనుచరుల వికృత చేష్టలతో నాడు పరిటాల రవీంద్ర చేసిన అరాచకాలు గుర్తొచ్చాయి. ముందు రోజు రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అల్లర్లు.. ఎన్నికల రోజున పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ సభ్యురాలు భారతి కిడ్నాప్‌ ఉదంతంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు.

ఏమాత్రం బలం లేకపోయినా కుటిల రాజకీయంతో ఎంపీపీ స్థానాలను కై వసం చేసుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేశారు. రొద్దంలో వారి పాచిక పారకపోగా.. గాండ్లపెంట, రామగిరి ఎంపీపీలను తమ ఖాతాలోకి వేసుకోవాలని అరాచకానికి తెరతీశారు. ఇందులో భాగంగానే ఆ రెండు ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ముఖ్యంగా రామగిరిలో ‘పరిటాల’ కుటుంబం దౌర్జన్యకాండ అందరినీ బెంబేలెత్తిస్తోంది.

రామగిరి ఎంపీపీ ఎన్నికలో

పరిటాల కుటిల రాజకీయం

ప్లాన్‌ ప్రకారం ఎన్నిక

వాయిదా వేయించిన వైనం

వైఎస్సార్‌సీపీ సభ్యురాలు

భారతి కిడ్నాప్‌

గాండ్లపెంటలోనూ సమయం

దాటిందని ఎన్నిక వాయిదా

రొద్దంలో బెడిసికొట్టిన టీడీపీ ప్లాన్‌

అధికారం ఉందనే అరాచకం

గత ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని అధికార మదంతో ఇప్పుడు అరాచకం చేస్తున్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకొని ఎంపీపీ స్థానాలను కై వసం చేసుకునేందుకు యత్నించడం సిగ్గుచేటు. రొద్దంలో టీడీపీ ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు తలొగ్గలేదు. రామగిరి, గాండ్లపెంటలో వైఎస్సార్‌సీపీకి బలమున్నా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం కూడా అధికార పార్టీ నేతలకు సపోర్ట్‌ చేయడం బాధాకరం. పోలీస్‌ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం దుర్మార్గం.

– ఉషశ్రీచరణ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

పరిటాల కోసమే పని చేస్తున్నారా?

హైకోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పరిటాలకు అనుకూలంగా పని చేయడం దారుణం. పోలీసులు తమ పని తాము చేస్తే.. ఓ దళిత మహిళ ఎలా కిడ్నాప్‌కు గురవుతుంది. మా ఎంపీటీసీ సభ్యులతో పరిటాల సునీతతో ఫోన్‌ కాల్స్‌ ఎలా మాట్లాడిస్తారు? పరిటాల కుటుంబానికి అనుకూలంగా పని చేసేందుకే వచ్చి ఉంటే యూనిఫాం తీసి.. పచ్చ కండువా వేసుకుని తిరగండి. బందోబస్తులో ఉండాల్సిన పోలీసులు పరిటాల సునీతతో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడించాల్సిన అవసరం ఏముంది. మొన్నటి దాకా సెలవులో ఉన్న ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ ఉన్నఫలంగా డ్యూటీకి ఎందుకొచ్చాడు. పరిటాల సునీతకు ఊడిగం చేసేందుకే వచ్చాడా?

– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

జేబుల్లో కారం.. చేతిలో రాళ్లు

అనంతపురం జిల్లా కంబదూరు ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు పన్నింది. ఎన్నిక సందర్భంగా ‘పచ్చ’ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేశారు. ఒక్కొక్కరికి రూ.3 నుంచి రూ.4 లక్షలు ఇస్తామని బేరసారాలు చేశారు. ఈ క్రమంలోనే ఏకంగా డీఎస్పీ, ఆర్డీఓ వాహనాలపై రాళ్ల దాడికి యత్నించారు. జేబుల్లో కారం పొడి.. రాళ్లతో వచ్చి వీరంగం సృష్టించారు. అరగంట పాటు విద్యుత్‌కు అంతరాయం కలిగించారు. మండలంలోని ఒంటారెడ్డి పల్లి వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ ఏనుముల సోమశేఖర్‌ను ఎన్నికకు అరగంట ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆయన ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని తిరిగి ఎన్నిక ప్రక్రియలో పాల్గొనడం గమనార్హం. ఇక.. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల ఎంపీపీగా రాళ్ల అనంతపురం ఎంపీటీసీ కే. లక్ష్మీదేవి ఎన్నుకుంటూ వైఎస్సార్‌ సీపీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మాన ప్రతిని ములకనూరు ఎంపీటీసీ తిమ్మరాజమ్మ చింపివేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు ఎన్నిక మధ్యలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ మద్దిలేటి అనారోగ్యం పాలవడం కలకలం రేపింది. వెంటనే ఆయన్ను కంబదూరు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ వెంటనే అక్కడకు చేరుకుని ఎన్నికల అధికారిగా శెట్టూరు తహసీల్దార్‌ ఈశ్వరయ్య శెట్టిని నియమించి.. ప్రక్రియను పూర్తి చేయించారు. ఎంపీపీగా కే. లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎంపికై నట్లు జేసీ శివ్‌ నారాయణ శర్మ ప్రకటించారు.

దౌర్జన్యం.. దుర్మార్గం1
1/7

దౌర్జన్యం.. దుర్మార్గం

దౌర్జన్యం.. దుర్మార్గం2
2/7

దౌర్జన్యం.. దుర్మార్గం

దౌర్జన్యం.. దుర్మార్గం3
3/7

దౌర్జన్యం.. దుర్మార్గం

దౌర్జన్యం.. దుర్మార్గం4
4/7

దౌర్జన్యం.. దుర్మార్గం

దౌర్జన్యం.. దుర్మార్గం5
5/7

దౌర్జన్యం.. దుర్మార్గం

దౌర్జన్యం.. దుర్మార్గం6
6/7

దౌర్జన్యం.. దుర్మార్గం

దౌర్జన్యం.. దుర్మార్గం7
7/7

దౌర్జన్యం.. దుర్మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement