ఉరవకొండ: నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు, ఆమిద్యాల గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ కత్తులు, రాడ్లతో హల్‌చల్ చేశారు. ఆమిద్యాలలోని రంగమ్మ ఫిల్లింగ్ స్టేషన్ బంక్ వద్దకు బొలెరో వాహనంలో చేరుకున్న ఏడుగురు యువకులు ముఖానికి కర్ఛీప్‌లు కట్టుకుని అక్కడ నిద్రిస్తున్న సిబ్బందిని లేపి కత్తులు, రాడ్లతో బెదిరిస్తూ ఓ మూలన కూర్చొబెట్టారు. మేనేజర్ గదిలోకి చొరబడి రూ.2.80 లక్షలు అపహరించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లారు. అనంతరం వజ్రకరూరులోని శివశక్తి పెట్రోల్ బంకులోనూ సిబ్బందిని బెదిరించి రూ1.20 లక్షలను అపహరించారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ రూరల్ సీఐ సయ్యద్ చిన్నగౌస్, అర్బన్ సీఐ మహనంది, ఎస్‌ఐ జనార్థన్‌నాయుడు, వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి, క్లూస్ టీం సభ్యులు అక్కడకు చేరుకుని నిందితుల వేలిముద్రలు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకుని ఆమిద్యాల పెట్రోల్ బంకు మేనేజర్ పెద్దన్న, వజ్రకరూరు బంకు మేనేజర్ రామాంజినేయలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
బాబోయ్.. దోపిడీ దొంగలు
బాబోయ్.. దోపిడీ దొంగలు
బాబోయ్.. దోపిడీ దొంగలు