హిందూపురం టౌన్: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బాల నటుడు రేవంత్ ఉగాది పండుగ రోజున హిందూపురం వచ్చి సందడి చేశారు. పట్టణంలో ఓ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్, రేవంత్ డైలాగ్‌లతో అభిమానులను అలరించారు.
జిల్లాను ప్రగతిపథంలో నిలపాలి
● కలెక్టర్ చేతన్ ఆకాంక్ష
ప్రశాంతి నిలయం: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరికీ శుభాలు చేకూర్చాలని, జిల్లాను అన్ని రంగాల్లో విజయపథంలో నిలపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వేద పండితులు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వేద పండితులు పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సాంకేతిక పరిజ్ఞానం బాగా వృద్ధి చెందుతుందని తద్వారా మానవశ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని తెలిపారు.
అనంతరం ధర్మవరానికి చెందిన మనస నృత్య కళానిలయం బృందం సంప్రదాయ, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. జిల్లాకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి చాంద్‌బాషా, డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, డాక్టర్ శివన్న, కవయిత్రి కొండసాని రజిత, తెలుగు పండితులు అమర చంద్రబాబు, మాణిక్యం ఇసాక్ ఉగాది కవితలను శ్రావ్యంగా గానం చేశారు. ప్రతిభ చాటిన కవులకు, వేదపండితులకు కలెక్టర్ సన్మాన చేశారు.
అలాగే 62 సంవత్సరాల పూర్తి చేసుకున్న పలువురు పండితులకు దేవదాయ శాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ.10,116 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ, పర్యాటక శాఖ జిల్లా ఇన్‌చార్జ్ నరసయ్య, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, దేవదాయ శాఖ అధికారి నరసింహరాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

‘ఉగాది’కి వచ్చారు!

ఉగాది వేడుకలు