
గంజాయి విక్రేతల అరెస్ట్
హిందూపురం అర్బన్: ఓ ముఠాగా ఏర్పడి హిందూపురంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. గురువారం హిందూపురం వన్‌టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. హిందూపురానికి చెందిన జాహీద్ అహమ్మద్ తరచూ పెనుకొండ దర్గాకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో అక్కడ బాబా ఫకృద్దీన్‌తో పరిచయమైంది. పెనుకొండకు వచ్చే కొందరి నుంచి గంజాయి కొనుగోలు చేసి సేవించడంతో పాటు హిందూపురంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని విక్రయించసాగారు. ఇటీవల అందిన పక్కా సమాచారంతో సబ్ డివిజన్‌లోని అన్ని పీఎస్‌ల సిబ్బంది బృందాలుగా విడిపోయి వారి కదలికలపై నిఘా పెంచారు. గురువారం ఉదయం కొడికొండ చెక్‌పోస్టు – శిర మార్గంలో బైలాంజనేయస్వామి ఆలయం సమీపంలో ముఠా సభ్యులు మాట్లాడుకుంటుండగా పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పెనుకొండ బాబాఫకృద్ధీన్, హిందూపురంలోని హస్నాబాద్‌కు చెందిన జాహీద్ అహమ్మద్, మేళాపురం నివాసి షేక్ తబ్రీజ్, నేతాజీ నగర్‌కు చెందిన సాయి వినయ్, అహమ్మద్ నగర్ నివాసి ఇమ్రాన్ ఉన్నారు. వీరి నుంచి 600 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ పాతికేళ్ల లోపు వయసున్నవారే కావడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడిన వీరు గంజాయి సేవించడమే కాక దానినే వ్యాపారంగా మార్చుకుని హిందూపురంలోని పలువురు యువకులకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.