ప్రశాంతి నిలయం: ‘ప్రధాన మంత్రి సూర్యఘర్’ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టర్ చేతన్ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘సూర్యఘర్’ పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్రం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేలు సబ్సిడీ ఇచ్చి ఉచితంగా సోలార్ పరికరాలను బిగిస్తుందన్నారు. తమ అవసరాలకు వినియోగించుకొని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తే యూనిట్‌కు రూ.2.90 వంతున చెల్లిస్తారన్నారు. ఇక బీసీ వర్గాలకు 2 కిలోవాట్‌కు కేంద్రం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు సబ్సిడీ ఇస్తుందని, మిగతా రూ. 35 వేలను లబ్ధిదారుడు బ్యాంక్ ద్వారా రుణంగా పొందవచ్చన్నారు.
విజన్ ప్రణాళిక కమిటీని ఎంపిక చేయండి..
నియోజకవర్గాల విజన్ ప్రణాళికల్లో భూగర్భజలాలు, వ్యవసాయం, ఉద్యానవన శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొనాలన్నారు. విజన్ ప్రణాళిక కమిటీ మెంటర్లుగా విషయ పరిజ్ఞానం ఉన్న వారిని నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున, జిల్లా స్థాయి కమిటీకి ఐదుగురిని ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో ప్రభుత్వ కార్యాలయాల్లో వాట్సాప్ పరిపాలను పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నీటి నాణ్యత తనిఖీని నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ, ఆర్డీఓలను ఆదేశించారు. తాగునీటి పైపులైన్ లీకేజీ కాకుండా ముందస్తుగా మరమ్మతు పనులు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులాల్లో పారంపాండ్లు, పశువులకు నీటి తొట్టెల నిర్మించాలని, రోడ్డు కనెక్టివిటీ ఉండే ప్రాంతాలను గుర్తించి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సీపీఓ విజయ్ కుమార్, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, కదిరి ఆర్డీఓలు సువర్ణ, మహేష్, ఆనంద్, శర్మ, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి, డీపీఓ సమత, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.