చిలమత్తూరు: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లు వల్ల వక్ఫ్ ఆస్తులన్నీ పరాధీనం అవుతాయని పలువురు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీలో వైఎస్సార్ సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, పార్టీ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు చాంద్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జబిఉల్లా, వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆసీఫుల్లా తదితరులతో కలిసి వందలాది మంది ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన కూటమి పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, జనసేనలు ముస్లింలకు తీరని అన్యాయం చేశాయన్నారు. ఆ పార్టీలకు తప్పక బుద్ధిచెబుతామన్నారు.
ముస్లింలకు అన్యాయం జరిగితే సహించం..
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగించేలా సవరణ చేశారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం ద్వారా వారి హక్కులకు భంగం కలుగుతుందన్నారు. అందువల్లే వైఎస్సార్ సీపీ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందన్నారు. ముస్లింలకు బాసటగా వైఎస్సార్ సీపీ ఎప్పుడూ నిలబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు డాక్టర్ బాషా, దాదాపీర్, రోషన్ అలీ, మల్లికార్జున, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాగమణి, వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం నాయకుడు మహేష్ గౌడ్, నాయకులు అమానుల్లా, ఆర్‌కే ఖలీల్, హుమయూన్, సీపీసీ సాధిఖ్, ఫరూక్, ఆసిఫ్, అయూబ్, నౌషద్, ఇమ్రాన్, బాబా, సీఎన్‌పీ నాగరాజు, హబీబ్, డిష్ చాంద్, ముస్తూ తదితరులు పాల్గొన్నారు.
బిల్లుకు వ్యతిరేకంగా
కదం తొక్కిన ముస్లింలు
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
హిందూపురంలో నిరసన
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం