
నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు
మడకశిర రూరల్: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మడకశిర మండలం నీలకంఠాపురంలో వెలిసిన నీలకంఠేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం ఉచిత సామూహిక వివాహాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎన్ రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో 18 జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యాయి. అంతకు ముందు సీతారాముల కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కర్ణాటకలోని పట్టనాయకనహళ్లి నంజావధూతస్వామి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నూతన జంటలకు తాళిబొట్లు, నూతన వస్త్రాలు, కాలిమెట్లను నంజావధూతస్వామి, రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు అందించి ఆశ్వీదించారు. వేడుకకు హాజరైన వందలాది మందికి పెళ్లి విందు భోజనం ఏర్పాటు చేశారు. కాగా, శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, సేవామందిర విద్యాసంస్థల అధినేత కేటీ శ్రీధర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ కళావతి, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.