
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 220 అర్జీలను అందగా...పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలన్నింటికీ నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లాలో అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్ట్‌లైన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జిల్లాలో త్వరిత గతిన పూర్తయ్యేలా ఎంపీడీఓలు బాధ్యత తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులందరూ సంబంధిత మండలాలను సందర్శించి అన్ని జీఎస్‌డబ్ల్యూఎస్ నివేదికలను పర్యవేక్షించాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. పీ–4 సర్వే పనులు వేగవంతంగా చేయాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉదయం 9 నుంచే
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
జిల్లా కలెక్టరేట్‌లో వచ్చే వారం నుండీ ఉదయం 9 గంటల నుండీ మద్యాహ్నం 12 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు, ప్రజలు సమయ వేళలు గమనించి అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, పట్టు పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి భాయి, ఎల్‌డీఎం రమణకుమార్, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ..
మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ‘మహిళలపై లైంగిక వేధింపుల చట్టం–2013’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతి విభాగంలోను, ప్రతి స్థాయిలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు విచారించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం