
అక్కాచెల్లిని వివాహం చేసుకుంటున్న మేనమామ
గోరంట్ల: పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మహిళలను వివాహం చేసుకుంటుండడం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన దివంగత నిడిగింటి గంగులమ్మ, రాజు వేలు దంపతుల కుమారుడు గంగరాజు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన సుశీల, రఘు దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యను ఈ నెల 10న వివాహం చేసుకోనున్నాడు.
ఇందుకు గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్ వేదికగా మారింది. వీరి పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, వధువుల తల్లి సుశీల వరుడు గంగరాజుకు స్వయానా అక్క. సుశీల రెండో కుమార్తె ఐశ్వర్య చిన్నప్పటి నుంచి మేనమామ గంగరాజు ఇంట్లోనే ఉంటోంది. ఇద్దరు అమ్మాయిలకూ మేనమామ అయిన గంగరాజు అంటే చాలా ప్రేమ.
ఇటీవల ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సుశీల మొదటి కుమార్తె శ్రీలక్ష్మిని గంగరాజుకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే ఐశ్వర్య తాను కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు.