
జానపద కళాకారిణికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
ధర్మవరం అర్బన్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ధర్మవరం పట్టణానికి చెందిన జానపద కళాకారిణి సోమిశెట్టి సరళకు చోటు దక్కింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను మంగళవారం ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున టీం లీడర్ గాయత్రి ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో తన బృందంతో గరగ నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కేలా చేసిందన్నారు.
వివాహిత బలవన్మరణం
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లికి చెందిన మురళి భార్య నీలమ్మ (32) ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, భర్త మురళి వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్త చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
● గోరంట్ల: మండలంలోని పుట్టగుండ్లపల్లి గ్రామానికి చెందిన వివాహిత వడ్డే సరస్వతి (33) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... వడ్డే సరస్వతిని తరచూ భర్త, అత్త అనుమానంతో వేధింపులకు గురి చేసేవారు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
దొంగను పట్టించిన రైతులు
బత్తలపల్లి: వ్యవసాయ తోటల వద్ద రైతులు పండించిన పంటను అపహరించుకెళుతున్న ఓ యువకుడిని రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు... సంజీవపురం గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ దానిమ్మ పంటను సాగు చేశారు. పంట చేతికి రావడంతో పొలంలో సోమవారం రాత్రి కాపలా కాస్తుండగా ఈదుల ముష్టూరు బీసీ కాలనీకి చెందిన నాగరాజు తన ద్విచక్రవాహనంలో పొలం వద్దకు చేరుకున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో గమనించిన రైతు వెంటనే గ్రామస్తులకు, సన్నిహితులకు సమాచారం చేరవేశాడు. వారు పొలం వద్దకు చేరుకుని నాగరాజును పట్టుకున్నారు. ద్విచక్రవాహనంతో సహా పోలీసులకు అప్పగించారు. విచారణలో దానిమ్మ కాయలను కోసుకెళ్లేందుకు వచ్చినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు వెల్లడైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
తోటకు నిప్పు
ముదిగుబ్బ: మండల కేంద్రంలోని ఐఏఎస్ రామాంజినేయులు తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితురాలు మంజుల తెలిపారు. తోటకు సమీపంలో ఉన్న ఎండుగడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పురాజేయడంతో మంటలు వ్యాపించి తోటను చుట్టుముట్టినట్లు వివరించారు. పొలం చుట్లూ ఉన్న 100 టెంకాయ చెట్లతో పాటు 70 చీనీ చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది.