
‘పరిటాల’ పతనం ప్రారంభమైంది
రామగిరి: కురుబ లింగమయ్య హత్యతో పరిటాల కుటుంబం రాజకీయ పతనం ప్రారంభమైనట్లేనని విశ్రాంత జిల్లా జడ్జి ఎం.కృష్ణప్ప అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలను ఎదుర్కోలేక హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సబబు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను కురుబ సంఘం నాయకులు బుధవారం పాపిరెడ్డిపల్లికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కురుబలు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేక హత్యలకు తెగబడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం విశ్రాంత జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. లింగమయ్య హత్య కేసు పక్కదోవ పట్టించకుండా నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్ష వైఖరి వీడి.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. చట్టం ఎవరి చుట్టం కాదని.. చట్టానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పోలీసుపై ఉందన్నారు. లింగమయ్య హత్య కేసును సీబీ సీఐడీకి బదిలీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. ఎస్‌ఐ తన పరిధి మేరకు.. తాను చేసే వృత్తిలో నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తే మంచిదని సూచించారు. సుధాకర్ యాదవ్ సక్రమంగా విధులు నిర్వర్తించి ఉంటే లింగమయ్య హత్య జరిగేది కాదని జనం నోట నానుతోందన్నారు.
కురుబల జోలికొస్తే ఖబడ్దార్..
కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు మాట్లాడుతూ.. కురుబల జోలికొస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేసుకునే రైతు లింగమయ్యను హత్య చేయడం దారుణమన్నారు. రామగిరిలో ఏ రాజ్యాంగం అమలులో ఉందో అర్థం కావడం లేదన్నారు. హత్యారాజకీయాలను ప్రోత్సహించడం రాజకీయం కాదని హితవు పలికారు. కురుబ కులస్తులు సౌమ్యులని.. ఎవరి జోలికీ పోరని.. అలా అని రాజకీయం అంటగట్టి హత్యలకు తెగబడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. లింగమయ్యను హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడే వరకు పోరాడతామన్నారు. అంతకుముందు లింగమయ్య భార్య రామాంజినమ్మ, పెద్దకుమారుడు మనోహర్, ఆయన భార్య రేణుక, చిన్న కుమారుడు శ్రీనివాసులు, కుమార్తె ప్రమీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కురుబ సంఘం నాయకులు పరామర్శించారు.
కురుబ లింగమయ్య హత్య
దుర్మార్గం
పాపిరెడ్డిపల్లిలో విశ్రాంత
జిల్లా జడ్జి ఎం.కృష్ణప్ప
కురుబల జోలికొస్తే ఖబడ్దార్
హెచ్చరించిన కురుబ సంఘం
జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు

‘పరిటాల’ పతనం ప్రారంభమైంది