
13న యూపీఎస్‌సీ ఫ్లాగ్‌షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్: ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఈనెల 13న ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులకు ఫ్లాగ్‌షిప్ పరీక్ష జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 363 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. యూపీఎస్‌సీ నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి’ అని అనంతపురం కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరుగుతాయన్నారు. ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.రామ్మోహన్, రూట్ ఆఫీసర్‌గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, కేఎస్‌ఎస్ డిగ్రీ, పీజీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, రూట్ అధికారిగా వి.మల్లికార్జునరెడ్డిని నియమించామన్నారు. కేంద్రం వద్ద ఒక ఎస్‌ఐ, ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష వేళలకు అనుకూలంగా బస్సులు నడపాలని ఆదేశించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
పరీక్ష సమయాలు ఇలా...
● ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేపర్–2, 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–3 పరీక్ష జరుగుతుంది.
● కేఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళ కళాశాల పరీక్ష కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1, 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 జరుగుతుంది.
● అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి.
● ఈ–అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, పెన్, పెన్సిల్ తీసుకువాల్సి ఉంటుంది.
● మొబైల్ ఫోన్లు, డిజిటల్, స్మార్ట్ గడియారాలు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.