
కాంట్రాక్టర్ బలవంతపు వసూళ్లు
సోమందేపల్లి: గ్రామ పంచాయతీ పరిధిలో వారపు సంతకు సంబంధించి అధిక రుసుం వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ వ్యాపారులు గురువారం ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ ధర్నాలో పలువురు మాట్లాడుతూ.. గతంలో వారపు సంతలో దుకాణం నిర్వహణకు రూ.150 చెల్లిస్తుండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుంకం వసూలుదారులు ఏకంగా రూ.300 నుంచి రూ.400 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రోజంతా తాము కష్టపడి సంపాదించిన సొమ్ము కాంట్రాక్టర్ల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదాయం సమకూరుతున్నా మార్కెట్‌లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అధికారులు ఎంతకూ స్పందించక పోవడంతో వ్యాపారస్తులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా వసూళ్లు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
పంచాయతీ కార్యాలయం ఎదుట వ్యాపారుల ధర్నా