చిలమత్తూరు: హిందూపురం పట్టణ పరిధిలోని మోతుకపల్లిలో టీడీపీ నేత చంద్రమోహన్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. ఏకంగా రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించిన అడ్డుకునే అధికారి లేకపోయాడు. తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా రోడ్డును చంద్రమోహన్ ఆక్రమించాడంటూ మున్సిపల్ అధికారులకు అదే గ్రామానికి చెందిన గొల్ల పవన్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేత కబ్జా పర్వం బయట పడింది.
దీంతో అప్పటి వరకూ కబ్జాపై ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన అధికారుల్లో చలనం మొదలై ఈ నెల 3న క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆక్రమణ నిజమని నిర్ధారించుకుని సదరు టీడీపీ నేతకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోపు తొలగించాలని ఆదేశించినా టీడీపీ నేత లెక్క చేయకుండా ప్రహరీని అలాగే ఉంచాడు. ప్రహరీని కూల్చరాదంటూ అధికారులపై ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ ఒత్తిడి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మళ్లీ అధికారులు మిన్నకుండిపోయారు.
రాగి పంట పరిశీలన
చిలమత్తూరు/లేపాక్షి: మండలంలోని టేకులోడు, లేపాక్షి మండలం కల్లూరు గ్రామాల్లో రైతులు సాగు చేసిన రాగి పంటను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) ఎవాల్యూటర్ బి.వెంకటేష్ గురువారం పరిశీలించారు. ఐఎన్‌డీజీఏపీ సర్టిఫికేషన్ కోసం కంబాలరాయుడు పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ద్వారా నమోదు చేసుకున్న హిందూపురం డివిజన్‌కు సంబంధించి 20 మందికి అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగు మందులను సిఫార్సు మేరకు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. విత్తన ధ్రువీకరణ ప్రాముఖ్యతను వివరించారు. పురుగు మందుల అవశేషాల పరీక్ష నిమిత్తం రాగి విత్తన నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. కార్యక్రమంలో సీఈఓ హరి, ఏఓ శ్రీలత, వంశీకృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
గరుడ వాహనంపై శ్రీవారు
తాడిపత్రి: ఆలూరు కోనలో వెలసిన శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం దేవేరులతో కలసి గరుడవాహనంపై భక్తులకు శ్రీరంగనాథుడు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. రాత్రి గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

గరుడ వాహనంపై శ్రీవారు