
కిడ్నీ బాధితుడికి ఆర్థికసాయం
ధర్మవరం అర్బన్: స్థానిక మహాత్మాగాంధీ కాలనీలో నివాసముంటున్న కిడ్నీ బాధితుడు మల్లిపోగుల శ్రీనివాసులు చికిత్సకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భరోసానిచ్చారు. రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన శ్రీనివాసులు దుస్థితిపై ఈ నెల 10న ‘తండ్రి కోసం తనయ పోరాటం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం తెలిసిందే. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆయన ఆదేశాలతో బీజీపీ నియోజకవర్గ నేత హరీష్‌బాబు శుక్రవారం బాధితుడు శ్రీనివాసులును కలసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాధితుడికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని బీజేపీ నాయకులు కృష్ణాపురం జమీర్, షాన్‌షా అందజేశారు. మరికొందరు బీజేపీ నాయకులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోనైనా శ్రీనివాసులుకు వైద్యం చేయిస్తామని హరీష్‌బాబు హామీనిచ్చారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గీతామాధురి, లక్ష్మీప్రసన్న, చిగురుపాటి లక్ష్మి, పట్టణ అధ్యక్షుడు జింకా చంద్రశేఖర్, బిల్లే శ్రీనివాసులు, పోతుకుంట రాజు, కుంచపు నారప్ప, పెద్ద లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.

కిడ్నీ బాధితుడికి ఆర్థికసాయం