
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి
ప్రశాంతి నిలయం: ప్రజలకు పాదర్శకంగా సేవలు అందిస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ సేవలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సర్వే అధికారులలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్, రెవెన్యూ అంశాలు, రీ సర్వే, ఆర్‌ఓఆర్ కేసుల నమోదు, వాటి పరిష్కారం, మ్యుటేషన్ ఆడిట్, అసైన్మెంట్ భూముల సమస్యలు, సర్వేయర్ల శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే దరఖాస్తులు గడువులోపు నాణ్యతగా పరిష్కరించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సమస్యలను నాణ్యతగా పరిష్కారం చేయాలని, రీ సర్వే ప్రక్రియలో పురోగతి సాధించాలన్నారు. పీ–4 సర్వేకి సంబంధించిన పనులను మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, ప్రీ హోల్డ్ రెండో విడత రీసర్వే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈనెల 15 నుంచి జిల్లాలో రీ సర్వే రెండో విడత ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు సువర్ణ, మహేష్, శర్మ, ఆనంద్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ జిల్లా అధికారి విజయశాంతి బాయి, జిల్లాలోని 32 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి