
జర్నలిస్ట్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
● పెనుకొండలో జర్నలిస్టుల డిమాండ్
పెనుకొండ రూరల్: ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పెనుకొండ జర్నలిస్ట్‌లు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం పెనుకొండలోని పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ గిరిధర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో జరిగిన ఓ హత్యకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలతో ‘సాక్షి’ వార్త ప్రచురించిందన్నారు. దీన్ని సహించలేని టీడీపీ నేతలు జర్నలిస్టులపై కేసులు పెట్టారన్నారు. ఇది ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛపై దాడేనన్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాక్షి జర్నలిస్టులు మల్లికార్జున, గోవిందు, జాకీర్, మురళీ (సాక్షి టీవీ), రామకృష్ణ (వార్త), ఆదినారాయణ (విశాలాంధ్ర), రామాంజి (సీమవార్త), హరి (రాజ్ న్యూస్), ఉదయ భాను (హెచ్‌ఎం టీవి), మహేష్ (ఆర్‌టీవీ) తదితరులు పాల్గొన్నారు.