
ఉయ్యాలసేవలో చౌడేశ్వరీదేవి
అమడగూరు: చౌడేశ్వరీదేవి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శీతిరెడ్డిపల్లి గ్రామస్తులు అమ్మవారికి ఉయ్యాలసేవ నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆలయం నుంచి అమ్మవారిని డప్పు వాయిద్యాల నడుమ బెళ్ల్లీ రథంలో ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం పురవీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. యువత రంగునీళ్లు జల్లుకొంటూ సంతోషంగా ముందుకు సాగారు. తర్వాత కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలోకి అమ్మవారిని తీసుకొచ్చారు. అనంతరం ఈ ఏడాది నూతనంగా తయారు చేయించిన ఉయ్యాలలో అమ్మవారిని కొలువుదీర్చి పాటలు పాడుతూ ఊయలూపారు. మహిళలంతా ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బంధువర్గాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు.