
కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● అర్ధరాత్రి అమ్మవారికి జలధి ఉత్సవం
● నేడు బ్రహ్మ రథోత్సవం
రొళ్ల: చారిత్రక రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు సాగుతాయి. తొలిరోజు సాయంత్రం అమ్మావారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేశారు. రాత్రి అమ్మావారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. తిరిగి ప్రధాన ఆలయ ప్రాంగణంలో పట్టం కూర్చోబెట్టి అర్ధరాత్రి అక్కడి నుంచి సమీపాన గల పాలబావి వద్దకు మేళతాళాల నడుమ చేరుకున్నారు. ఉత్సవ విగ్రహానికి ప్రధాన అర్చకులు గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం కట్టి, పూలు, పండ్లు ఉంచి, హారతి ఇచ్చిన తర్వాత బావిలోకి నైవేద్యం సమర్పించారు. పాలబావిలో అమ్మవారికి గంగా జలంతో శుద్ధి చేసిన అనంతరం పూజలు నిర్వహిస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం, పెళ్లికాని యువతులకు పెళ్లిల్లు జగురుతాయని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. చుట్టు పక్కల గ్రామస్తులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు బ్రహ్మరథోత్సవం
రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో సోమవారం మధ్యాహ్నం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.