
మందు అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి
యాడికి: తాగేందుకు మందు ఇవ్వలేదన్న అక్కసుతో ఖాళీ మద్యం బాటిళ్లతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాడికిలో సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన మంగల గంగాధర్ సోమవారం వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మిగిలిన వారితో కలసి తాగుతూ కూర్చొన్నాడు. అదే సమయంలో గంగాధర్‌తో ఎలాంటి ముఖపరిచయం లేని యాడికి గ్రామానికి చెందిన మహేష్ అక్కడకు చేరుకుని తనకూ తాగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు గంగాధర్ నిరాకరించడంతో మహేష్ వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడుతూ ఆ పక్కనే పడి ఉన్న ఖాళీ మద్యం గాజు బాటిల్ తీసుకుని గంగాధర్ తలపై బలంగా బాదాడు. దీంతో గంగాధర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. సమాచారం అందుకున్న గంగాధర్ సమీప బంధువు అక్కడకు చేరుకుని వెంటనే క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న యాడికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
మాజీ సైనికుడి మృతి
హిందూపురం అర్బన్: స్థానిక న్యూ హస్నాబాద్‌లో నివాసముంటున్న మాజీ సైనికుడు ఎ.ఆదినారాయణ (86) సోమవారం అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయనకు భార్య గ్రేస్ ఆదిలక్ష్మీదేవి, కుమార్తె సుమలత, కుమారులు కామేష్, నాగేంద్రకుమార్ (ఎస్‌డీజీఎస్ కళాశాల ప్రిన్సిపాల్), స్టీఫెన్‌రాజ్, మనవలు, మనుమరాళ్లు ఉన్నారు. 24 ఏళ్లపాటు సైన్యంలో పనిచేసిన ఆయన 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి శత్రుసైనికులను దేశంలో చొరబడకుండా అడ్డుకున్నారు. ఆదినారాయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
కదిరి టౌన్: తనకల్లు మండలం గోవిందువారిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం గోవిందవారిపల్లి వద్ద నలుగురు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా గమనించిన తనకల్లు ఎస్‌ఐ గోపి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయలో వారు అక్కడి నుంచి పారిపోతుండడంతో అనుమానం వచ్చి కానిస్టేబుళ్లు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉన్న గంజాయి, 4 సెల్‌పోన్లు, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకుని డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేయించారు. నిందితులను బాలంగిరి జిల్లా నూంహాడ్ గ్రామానికి చెందిన తులసీ పరదు, అన్మమయ్య జిల్లా ముదివేడు మండలం గుట్టమీదసాహెబుల పల్లికి చెందిన రెడ్డి బాషా, మొలకలచెరువు మండలం ఎపురకోటకు చెందిన కె.నరసింహులు, అన్నమయ్య జిల్లా బాలసముద్రం గ్రామానికి చెందిన సురేందర్‌గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
ముగిసిన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
తాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు సోమవారం స్వామి వారికి కోనలో తీర్థవాది, వసంతోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలు అర్చకులు జరిపించారు. అనంతరం స్వామి వారికి పుష్పయాగ కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రికి రంగనాథస్వామి వారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

మందు అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి

మందు అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి

మందు అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి

మందు అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి