
ఏడు నెలలు.. మద్యం ఏరులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని ఉమ్మడి అనంతపురం జిల్లా మద్యం మత్తులో ఊగిపోతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద మందు బాబులతో జాతర వాతావరణం తలపిస్తోంది. రోడ్డుమీదే తాగుతూ చిందులేస్తున్నారు. పట్టణాల్లో పర్మిట్ రూములు, పల్లెటూళ్లలో బెల్టుషాపులు.. ఇదీ దుస్థితి. నాలుగు వందల జనాభా ఉన్న గ్రామంలో కూడా రెండు, మూడు బెల్టుషాపులు పెట్టి రేషన్ బియ్యం తరహాలో ఇంటింటికీ మద్యం అమ్ముతున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న మద్యం వ్యాపారంతో వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
ఏడు నెలల్లో 1.16 కోట్ల లీటర్ల మద్యం..
కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 2025 ఏప్రిల్ 15 వరకూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.16 కోట్ల లీటర్ల మద్యం తాగించేశారు. దీన్ని ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్లతో పోలిస్తే 2,337 ట్యాంకర్ల మద్యం తాగినట్టు లెక్క కావడం గమనార్హం. రోజుకు సగటున రెండు జిల్లాల్లో 55,658 లీటర్ల మద్యం వినియోగమవుతోంది. ఇదికాకుండా ఏడు నెలల్లో 39 లక్షల లీటర్ల బీరు తాగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజు రోజుకూ మద్యానికి అలవాటు పడుతున్న యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
నేతల షాపులపై కన్నెత్తి చూడరు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 230 వరకూ మద్యం షాపులున్నాయి. వీటిలో మెజారిటీ షాపులు టీడీపీ ఎమ్మెల్యేలవే. ఈ దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. ఎవరైనా అటువైపు వెళితే బదిలీ చేస్తామని ఎకై ్సజ్ అధికారులను ‘పచ్చ’ నేతలు బెదిరిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే మద్యం షాపులు పనిచేయాలి. కానీ రాప్తాడు, రాయదుర్గం లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే షాపులు తెరుస్తున్నారు. అనంతపురం లాంటి చోట్ల టీడీపీ ఎమ్మెల్యే మద్యం దుకాణాల పక్కనే పర్మిట్ రూములు ఏ సమయంలో చూసినా జనం కిక్కిరిసి ఉంటున్నాయి. అయినా ఎవరూ పట్టించుకునే దిక్కులేదు. అడ్డూ అదుపు లేని ఈ మద్యం అమ్మకాలతో సామాన్య కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం కారణంగా కుటుంబ తగాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
1.16 కోట్ల లీటర్ల మద్యం తాగేశారు
రోజుకు సగటున 55 వేల లీటర్లకు పైగా వినియోగం
మరో 39 లక్షల లీటర్ల బీర్లు కూడా..
పల్లెటూళ్లలో బెల్టుషాపులు..
పట్టణాల్లో పర్మిట్ రూములు
ఇప్పటివరకూ ఉమ్మడి అనంతలో మద్యం కోసం రూ. 925 కోట్ల వ్యయం

ఏడు నెలలు.. మద్యం ఏరులు