
నేడు సత్యసాయి ఆరాధనోత్సవాలు
ప్రశాంతి నిలయం: ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక, మానవతా విలువలను బోధిస్తూ సన్మార్గం వైపు నడిపిన మహనీయుడు సత్యసాయి ఆరాధనోత్సవాలు గురువారం జరగనున్నాయి. ఇందు కోసం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సర్వం సిద్ధం చేశారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక ఫల,పుష్ప దళాలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. తమ ఇష్ట దైవం సత్యసాయికి ఆత్మనివేదన అర్పించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు.
వేడుకలు ఇలా...
సత్యసాయి ఆరాధనోత్సవ వేడుకలు సాయికుల్వంత్ సభా మందిరంలో గురువారం ఉదయం 8 గంటల సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ పంచరత్నకీర్తనలు అలపిస్తారు. 9.05 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద ప్రారంభోపన్యాసం చేస్తారు. 9.15 గంటలకు సత్యసాయి శతజయంతి వేడుకల బ్రోచర్ విడుదల చేస్తారు. 9.30కు సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్ పాండే వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. 9.40కు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని కార్యక్రమం ప్రారంబోత్సవం నిర్వహిస్తారు. 9.50కి సత్యసాయి పూర్వపు దివ్వ ప్రసంగాన్ని డిజిటల్ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు. 10.10 గంటలకు భజనలు, అనంతరం మంగళహారతితో వేడుకలు ముగుస్తాయి.
హిల్‌వ్యూ స్టేడియంలో
మహానారాయణ సేవ..
సత్యసాయి ఆరాధనమహోత్సవం సందర్భంగా సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మహానారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సాయికుల్వంత్ సభా మందిరంలో ఆరాధనోత్స వేడుకలు ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు నారాయణ సేవ కార్యక్రమాన్ని హిల్‌వ్యూ స్టేడియంలో ప్రారంభిస్తారు. 50 వేల మందికి అన్న ప్రసాదంతో పాటు నూతన వస్త్రాలను వితరణ చేస్తారు. భక్తులు ఉదయం 8 గంటలకే సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంకు చేరుకోవాలని కోరారు. డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతి నిలయంలో వేడుకలు
దేశ విదేశాల నుంచి తరలివచ్చిన
సత్యసాయి భక్తులు
సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ

నేడు సత్యసాయి ఆరాధనోత్సవాలు