తహసీల్దార్ కార్యాలయంలో నిద్రపోతున్న సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజు
లావేరు: లావేరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు బుధవారం విధి నిర్వహణలో నిద్రపోవడం విమర్శలకు తావిచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయానికి పనుల కోసం వచ్చారు. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజు కార్యాలయంలో, జూనియర్ అసిస్టెంట్ రాజేష్ కార్యాలయం బయట కుర్చీల్లో నిద్రపోతున్నారు.
అటెండర్ బాబూరావు షర్టు విప్పి అర్ధనగ్నంగా కనిపించారు. సెల్‌ఫోన్ ద్వారా వీరి ఫొటోలు తీసినా లేవలేదు. మద్యం మత్తులో ఉండటం వల్లే లేవలేదని విలేకర్లకు సమాచారం అందించారు. ఈ విషయమై సీనియర్ అసిస్టెంట్ గోవిందరాజులు వివరణ కోరగా ఎండ తీవ్రత, అనారోగ్య సమస్య వల్ల విశ్రాంతి తీసుకున్నానని, మద్యం సేవించలేదని చెప్పారు. జూనియర్ అసిస్టెంట్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో రాలేదు.
పరిశీలిస్తా..
ఈ విషయమై లావేరు తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి వద్ద ప్రస్తావించగా.. తాను సెలవులో ఉన్నట్లు చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ వేరే పనుల కోసం బయటకు వెళ్లారని తెలిపారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు విధుల సమయంలో కార్యాలయంలోనే నిద్రపోయారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment