హమ్మయ్యా.. అందరూ సేఫ్ | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా.. అందరూ సేఫ్

Published Sun, Jun 4 2023 11:28 AM | Last Updated on Sun, Jun 4 2023 11:57 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం మహా విషాదంగా మారింది. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. ఇంతటి ఘోర ప్రమాదానికి గురైన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా మన జిల్లాను దాటుకునే వెళ్తుంటాయి. ప్రమా దం జరిగిన వెంటనే మన జిల్లావాసులు ఏమైనా చిక్కుకున్నారా.. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారా.. అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ రేకెత్తాయి. ఘటన అనంతరం అంతా టీవీలకే అతుక్కుపోయా రు.

స్వల్పంగా నష్టం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల నుంచే స్థానిక జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎవరైనా సంప్రదించేలా చర్యలు చేపట్టింది. ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల వివరాలన్నీ దాదాపుగా ఖరారుకావడంతో పాటు ఈ రెండు రైళ్లలోనూ హాల్ట్‌ స్టేషన్ల వారీగా ఎక్కిన వారు, దిగిన వారి పేర్లతో సహా వివరాలను ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు విడుదల చేశారు. శనివారం సాయంత్రానికి వెలువడ్డ వివరాల మేరకు జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు మహిళలు గాయపడ్డారు.

హాల్ట్‌ లేకపోవడంతో..
స్థానిక జిల్లా నుంచి అటు తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు వివిధ వ్యాపార సంబంధాల క్రమంలో జిల్లా నుంచి ఎంతో మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే షాలీమార్‌ నుంచి చైన్నె వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు జిల్లా మొత్తం మీద హాల్ట్‌ లేదు. దీంతో జిల్లా వాసులు ఈ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే అవకాశమే లేదు. దీంతో చాలా పెద్ద ఊరటే అని చెప్పాలి. అయినప్పటికీ బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్డులో మధ్యాహ్నం 2 గంటలకు, పలాస స్టేషన్లలో మధ్యాహ్నం 3 గంటలకు ఆగి ఒడిశా మీదుగా వెళ్లింది.

జిల్లాకు చెందిన 16 మంది ప్రయాణికులు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో ఈ రైలెక్కారని అధికారులు వివరాలను ప్రకటించారు. పలాస స్టేషన్‌లో ఎక్కిన గురుమూర్తికి మృత్యువు వెంటాడింది. ఎల్లమ్మ అనే మహిళకు రెండు చేతులు విరిగిపోయాయి, మరో మహిళ గాయపడింది. ఆ రైలులో కేవలం చివరిలో ఉండే బోగీలు ప్రమాదానికి గురికావడంతో ముగ్గరు మాత్రమే ప్రమాదానికి గురయ్యారు.

మరోవైపు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాకపోకలకు మన జిల్లావాసులు పెద్దగా ప్రాధాన్యమివ్వరు. గత ప్రయాణికుల రికార్డులను బట్టి చూస్తే..అర్ధరాత్రి వేళల్లో గమ్యం చేరుతున్న రైళ్లకు జిల్లా వాసులు పెద్దగా ప్రాధాన్యతిచ్చే సందర్భాలు తక్కువనే చెప్పాలి. దీంతో శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన ప్రయాణికులు కూడా మార్గమధ్యలో అంటే పలాస, బరంపురం తదితర స్టేషన్లలోనే దిగిఉంటారని తెలుస్తోంది. ఏమీ లేదనుకున్నా జిల్లాకి చెందిన వారిలో ఒక్కరికి మృత్యువు వెంటాడగా.... ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

స్వల్ప గాయాలతో బయటపడి..
పోలాకి:
మండలంలోని కొత్తరేవు గ్రామానికి చెందిన తయి అను(35) అనే మహిళ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో బంధువులతో కలిసి ప్రయాణం చేస్తుండగా ప్రమాదంలో గాయాలపాలైంది. రైల్వేసిబ్బంది ఆమెను బాలేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అను క్షేమంగానే వున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కుటుంబసభ్యులు సైతం అమెకు అందుబాటులోకి వచ్చినట్లు కొత్తరేవు వీఆర్వో శంకర్‌ తెలిపారు.

లాభాం వాసులకు తప్పిన ప్రమాదం
బూర్జ:
మండలంలోని లాభాం గ్రామానికి చెందిన మెట్ట చంద్రమౌళి కొంతకాలంగా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో స్టేషన్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్య లీలావతి, ఇద్దరు పిల్లలు తేజ, సాల్విలతో కలిసి వేసవి సెలవులో నేపథ్యంలో హౌరా వెళ్లేందు కు ప్లాన్‌ చేశారు. వీరితో కలిసి మరికొందరు కూడా వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుని యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు టికెట్‌ సైతం రిజర్వేషన్‌ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో స్నేహితులు రాకపోవడం, శ్రీకాకుళం జిల్లాలో బంధువుల వివాహం ఉండటంతో చంద్రమౌళి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రేణిగుంటలో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి శుక్రవారం ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో దిగిపోయారు. ఇంతలో రైలు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు.

పలు రైళ్ల రద్దు
ఆమదాలవలస :
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం కారణంగా శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ మీదుగా నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. రైలు నంబర్లు 22504, 2644, 12508 దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైళ్లలో ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు విజయనగరం రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కాలని సూచించారు. 12839, 12863, 12703 నంబర్ల గల రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రైళ్ల రద్దుతో ఆమ దాలవలస బస్టాపులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.

ఘటనా స్థలికి జిల్లా అధికారులు
శ్రీకాకుళం పాతబస్టాండ్‌/కాశీబుగ్గ: ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని బహానగర్‌ వద్ద ప్రమాదానికి గురైన ప్రాంతానికి జిల్లా యంత్రాంగం చేరుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, మెడికల్‌ బృందాలకు, సహాయక బృందాలకు పలు సూచనలు జారీ చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్‌తో పాటు సమగ్ర శిక్ష ఏపీసీ జయప్రకాష్‌, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ ఈశ్వర ప్రసాద్‌, తహసీల్దారు ఎస్‌.గణపతిరావు, డాక్టర్‌ సుధీర్‌, డాక్డర్‌ భగవాన్‌దాస్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఆఫీసర్‌ ఎం.అనిల్‌ కుమార్‌, 13 మంది రెవెన్యూ బృందం వెళ్లింది.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. 08942 240557, 08942– 286213 / 286245 నంబర్లను సంప్రదించి సమాచారం తెలియజేయవచ్చు. డీఆర్‌ఓ మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.

సంతబొమ్మాళి: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో సంతబొమ్మాళి మండలం మత్స్యలేశ జగన్నాథపురం గ్రామానికి చెందిన వలస మత్స్యకారుడు చోడిపిల్లి గురుమూర్తి (65) మృతి చెందారు. బాలాసోర్‌ సమీపంలో సముద్రంలో చేపల వేట సాగిస్తూ వలస మత్స్యకారుడిగా కుటుంబంతో జీవిస్తున్నాడు. వృద్ధాప్య పింఛన్‌ అందుకోవడానికి మే 29వ తేదీన స్వగ్రామమైన మత్స్యలేశ జగన్నాథపురం గ్రామానికి వచ్చాడు, ఒకటో తేదీన పింఛన్‌ అందుకుని బాలాసోర్‌ వెళ్లడానికి పలాస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. కొద్ది గంటల్లో రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అలాగే ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన కారాడ ఎల్లమ్మ బాలాసోర్‌ రైలు ప్రమాదంలో రెండు చేతులు విరిగిపోయి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె బతుకు తెరువు కోసం బాలాసోర్‌ వెళ్లడానికి పలాస రైల్వే స్టేషన్‌లో యశ్వంత్‌పూర్‌ రైలు ఎక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement