అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్కిన్‌లెస్ చికెన్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విశాఖలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220, విజయనగరం జిల్లాలో కిలో రూ.220.. కానీ మన జిల్లాలో మాత్రం కిలో రూ.275కు విక్రయిస్తున్నారు. పక్కపక్క జిల్లాల్లో ఇంత వ్యత్యాసం చూసి కొనుగోలుదారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కోవిడ్ కాలం నుంచి దాదాపు ఇదే పరిస్థితి. పత్రికల్లో రేట్లు ప్రచురితమవుతున్నా.. బహిరంగంగానే ఈ మోసం జరుగుతోంది. జిల్లాలో సిండికేట్ దందా నడుస్తుందేమోనన్న అనుమానాలు కూడా జనాల్లో కలుగుతున్నా యి. జిల్లాలో మాంసం ప్రియులు ఎక్కువగానే ఉన్నారు.
కోవిడ్ వచ్చినప్పటి నుంచి గుడ్లు, పాలు, మాంసం తినడం ఎక్కువైంది. దీనికి తోడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటల్ భోజనాలు విపరీతంగా పెరిగాయి. వీటిని అదనుగా తీసుకుని సంబంధిత వ్యాపారులు సిండికేటై ధరలు పెంచుకుంటూ పోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రమంతా ధరలు ఏ రోజుకారోజు మారుతున్నా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ధరలు తగ్గించే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం శ్రీకాకుళం బాయిలర్ అసోసియేషన్ ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకే రిటైల్ వ్యాపారులు అమ్మకాలు చేయడమే.
పర్యవేక్షణ లేకపోవడం వల్లేనా..
చికెన్, గుడ్లు ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్ శాఖ అఽధికారులకు లేకపోవడంతో పరిస్థితి హద్దు మీరుతోంది. జిల్లాలోని రణస్ధలం, కోష్ట, పాలకొండ, కొల్లివలస,రాజాం, కోటబొమ్మాళి, గార, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. అందుబాటులో భారీగా కోళ్లు దొరుకుతున్నా ఇక్కడెందుకు మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్ ధరలు భారీగా ఉంటున్నాయని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి.
ప్రస్తుత ధర ప్రకారం జిల్లాలో రోజుకు రూ.4కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కో కిలోకు మిగతా జిల్లాలతో పోలిస్తే రూ. 50కు పైగా తేడా ఉండటంతో ఇక్కడ కొనుగోలు దారులు ఎంత అదనపు భారం మోస్తున్నారో లెక్క కట్టుకోవచ్చు. ఇదే విషయమై జిల్లా బాయిలర్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న వెంకటేష్ అనే వ్యక్తిని ‘సాక్షి’ సంప్రదించగా ‘మాకున్న ఇబ్బందు లు మాకు ఉన్నాయి. మిగతా జిల్లాల పరిస్థితి వేరు. ఇక్కడ వేరు. అందుకనే ధర తేడా ఉంటుంది. పేపర్ రేటుకు, వాస్తవ ధరకు తేడా ఉంటుంది. బల్క్‌లో కొనుగోలు చేస్తే ఆ రేటు ఇంకా తగ్గుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
వ్యాపారాలు చేయలేకపోతున్నాం
పక్క జిల్లాల్లో లేని ధరలు శ్రీకాకుళంలోనే ఉంటున్నా యి. కరోనా తర్వాత అమాంతంగా రూ.70కి పైగా పెంచేశారు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు రోజుకి 400 కేజీలు అమ్మకాలు చేసేవాళ్లం. ధరలు పెరిగిపోవడంతో రోజుకి 200కేజీలు అమ్మడం కూడా కష్టమైపోతోంది. ఎందుకిలా ధరలు ఎక్కువగా ఉన్నా యని ప్రశ్నిస్తే వ్యాపారానికి కావాల్సిన చికెన్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు.
– వై.రాజు, చికెన్ వ్యాపారి, బలగ
నియంత్రణ మా చేతుల్లో లేదు
చికెన్, గుడ్లు ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు. వ్యాధుల నియంత్రణకు ముంద స్తు జాగ్రత్తలు, వచ్చిన తర్వాత నివారణ చర్యలు మాత్రమే మేం చేపడతాం. ధరలు పెంచడం, నియంత్రించడంతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. విశాఖ, విజయనగరంల్లో ఏవిధంగా ధరలున్నాయో శ్రీకాకుళంలో కూడా అలాగే ఉండాలి. పౌల్ట్రీవ్యాపారులు సిండికేటుగా మారి ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. ధరల నియంత్రణకు జిల్లాలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీ వేసి నియంత్రణకు చర్యలు చేపడితే బాగుంటుంది.
– డాక్టర్ పొట్నూరు సూర్యం, ఇన్‌చార్జ్ జేడీ, పశుసంవర్ధకశాఖ, శ్రీకాకుళం.
ధరలు పెంచుకుంటూ పోతున్నారు
చికెన్ ధరలను ఇష్టం వచ్చి నట్లు పెంచుకుంటూ పోతున్నారు. కరోనాకు ముందు కిలో రూ.100కే దొరికేది. ఇప్పుడు మాత్రం రూ.275 ఉండటం దారుణం. ఆదివారం చికెన్ తిందామంటే ఒక్కోసారి రూ.300 మార్కు దాటిపోతోంది.
– ఆర్.యుగంధర్, కొనుగోలుదారుడు, గూనపాలెం, శ్రీకాకుళం.
దాబాలు నడపలేకపోతున్నాం
దాదాపుగా చికెన్ ఫుడ్ ఐటమ్స్ కోసం దాబాలకు అధికంగా వస్తుంటారు. కానీ చికెన్ ధరలు విశాఖ, విజయనగరం కంటే ఎక్కువగా ఉండడంతో నష్టాల బారిన పడుతున్నాం. కిలో రూ.275కు కొనుగోలు చేసి దాబాలు నడపాలంటే కష్టం. అలాగని రేటు పెంచితే కస్టమర్లు రారు. ఇటీవల కాలంలో దాదాపుగా శ్రీకాకుళం సిద్దిపేటరోడ్డులో నాలుగు దాబాలు మూసేశారు. ధరల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలి.
– పి.నవీన్, కేన్స్ స్పైసీదాబా, సిద్ధిపేట రోడ్డు, శ్రీకాకుళం.
Comments
Please login to add a commentAdd a comment