ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
పసుపు బిళ్ల వేసుకుని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే టీ ఇచ్చి పనిచేయాల్సిందేనని హుకుం
అలా చేయకపోతే ఏమవుతుందో ఉద్యోగులకు తెలుసు అంటూ హెచ్చరిక
పార్టీ కార్యకర్తల ముందు ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చేలా వ్యాఖ్యలు
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
‘ నేను మాటిస్తున్నాను.
రేపు అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను.
రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్‌ఐ దగ్గరకు వెళ్లినా..
ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా.. ఎండీఓ దగ్గరకు వెళ్లినా..
ఏ ఆఫీసుకు వెళ్లినా..
మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.
మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి.. మీ పనేంటి అని అడిగి మీ అందరికీ పనిచేయించే విధంగా అధికారులను లైనులో పెడతాను.
ఎవరైనా ఒకరో ఇద్దరో నా మాటకు జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నా’..
కార్యకర్తల ఆత్మీయ సభ, ఉద్యోగుల తొలి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.
ఇప్పుడీ వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియానూ కుదిపేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు రాష్ట్రంలో సంచలనంతో పాటు వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకొచ్చాక చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను కుదిపేశాయి. టీడీపీ శ్రేణులను ప్రభుత్వ కార్యాలయాలకు దూకుడుగా వెళ్లేలా ప్రోత్సహించేలా ఉన్నాయి.
అచ్చెన్నాయుడుకు మంత్రిగా పనిచేయడం కొత్తేమీ కాదు. 2014–19లో కూడా పనిచేశారు. అప్పట్లో కూడా కాస్త కటువుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఈ సారి అలా ఉండబోరని, ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటారని ఆయా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చిన తొలి పర్యటనలోనే ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయా వర్గాలు స్వీకరించలేకపోతున్నాయి. జాగ్రత్తగా పనిచేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రండి, ప్రజల్ని ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయి, ఏదైనా పనుల కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తే చూసి చేయండి, ప్రభుత్వ లైన్‌లో పనిచేయండి అనే విధంగా ఎవరైనా మాట్లాడుతారని.. కానీ అందుకు భిన్నంగా అచ్చెన్నాయుడు హెచ్చరిస్తూ మాట్లాడటాన్ని ఉద్యోగ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
‘టీడీపీ కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ల వేసుకుని వెళ్లండి. అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి ఆ పనిని చేసి పంపిస్తారు. ఎవరైనా అధికారులు మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు’ అని కార్యకర్తల ముందు చెప్పడం సరికాదని ఉద్యోగులు బాధపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే బెదిరింపు ధోరణిగానే ఉన్నాయని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సంచలనమయ్యాయి. సోషల్ మీడియాలోనైతే హల్‌చల్ చేశాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment