
నెలాఖరులోగా ‘పల్లె పండుగ’ పూర్తవ్వాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పల్లె పండుగ కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటినీ ఈ నెల చివరి వారం నాటికి పూర్తిచేసి బిల్లులు అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో మండలాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంజూరైన, పూర్తయిన పనులు, బిల్లుల మంజూరు, పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మంజూరైన రహదారులు, కల్వర్టులు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు నూరు శాతం పూర్తిచేసి బిల్లులు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే, నిధులు వెనక్కు వెళ్లక ముందే చొరవ తీసుకుని పని చేయించాలన్నారు. పంచాయతీరాజ్ అధికారులకు నిర్దేశించిన పనుల ప్రగతిలో వెనుకబడిన కొత్తూరు, వజ్రపు కొత్తూరు, టెక్కలి మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు. విధుల్లో అలసత్వం చూపుతున్నారని, 60 శాతం పనులు మాత్రమే పూర్తవడం పట్ల పాతపట్నం అర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎచ్చెర్లలో సచివాలయ ఉద్యోగుల హాజరు 46 శాతం మాత్రమే ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై ఏ మండలంలోనైనా సచివాలయ ఉద్యోగుల హాజరు 70 శాతం కంటే తక్కువ ఉంటే ఆయా ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీఓ భారతి సౌజన్య, జిల్లా వ్యవసాయాధికారి కోరాడ త్రినాథస్వామి, డీఎంహెచ్‌ఓ టీవీ బాలకృష్ణ, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
Comments
Please login to add a commentAdd a comment