మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించి ఎన్నికను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ అందజేత, స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలపాలని, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. విశాఖ జిల్లా ఏఆర్వో బిహెచ్.భవానీ శంకర్, అల్లూరి జిల్లా ఏఆర్వో పద్మలత, అనకాపల్లి జిల్లా ఏఆర్వో పీవీఎస్‌ఎస్‌ఎన్ సత్యనారాయణ, విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఏఆర్వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment