
ధాన్యం దళారులు భోజ్యం
సర్కారు చోద్యం
ధాన్యం అమ్మలేకపోతున్నాం..
● కొనుగోలు లక్ష్యాలను తగ్గించి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం
● ఒడిశా ధాన్యంతో టార్గెట్ పూర్తి
చేశారంటున్న రైతులు
● క్షేత్రస్థాయి పరిస్థితి గమనించని అధికారులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంట దళారుల పాలవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పంట దిగుబడిని గుర్తించడంలో లోపం, కొనుగోలు లక్ష్యాలు తక్కువగా పెట్టుకోవడం, ఆ లక్ష్యాలు నెరవేర్చేందుకు ఒడిశా ధాన్యం కొనడం వంటి తప్పిదాలు మన రైతుల పుట్టి ముంచాయి. ఎవరూ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో చివరకు మిల్లర్లు, మధ్యవర్తులతోనే బేరం కుదుర్చుకోవాల్సిన దుస్థితి రైతన్నలకు ఎదురవుతోంది.
లక్ష్యం నిర్ణయంలోనే కుట్ర
జిల్లాలో ఈ ఏడాది 3,60,325 ఎకరాల్లో వరి పండించారు. అయితే ఈ ఏడాది పంటలు ఆలస్యంగా వేసినా, దిగుబడి చాలా వరకు అనుకూలంగానే వచ్చింది. సుమారుగా ఈ ఏడాది వరి 8 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి దిగుబడి వచ్చింది. అయితే కోనుగోలు లక్ష్యాన్ని కేవలం 4.90 లక్షల మెట్రిక్ టన్నులుగానే నిర్ధారించారు. అంచనాలు కావాలనే తక్కువ వేసి, కొనుగోలు టార్గెట్లు తగ్గించారు. జిల్లాలో వరి పండించే రైతులు సుమారుగా 2.5 లక్షల మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 99 వేల మంది రైతులు మాత్రమే పంటను విక్రయించారు. మిగిలిన వారు ధాన్యం విక్రయించే పరిస్థితి లేదు.
గ్రామాల్లో దళారులు
ధాన్యం కొనుగోలు టార్గెట్లు పూర్తయిపోయాయని అధికారులు చెబుతుండడంతో.. దళారులు ఈ పరిస్థితిని అలుసుగా తీసుకున్నారు. దళారుల్లో అధిక శాతం మంది అధికార పక్షానికి చెందిన వారే. వీరు మిల్లర్లతో మిలాఖత్ కావడం వల్ల ధాన్యం సగం ధర మాత్రమే పలుకుతోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారు లు నేరుగా రైతుల వద్దకు వెళ్లి సగం ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు పీపీసీ కేంద్రాలు టార్గెట్ పూర్తి చేసే నెపంతో ఒడిశా ధాన్యం తీసుకువచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు కూడా సహకరించడంతో టార్గెట్లు సజావుగా పూర్తయిపోయాయని అంటున్నారు.
రాష్ట్రంలో గత ఐదేళ్లు ఈ పరిస్థితి లేదు. పీపీసీ కేంద్రాలు, రైతు భరోసాకేంద్రాల ద్వారా నేరుగా ధాన్యంను కళ్లం వద్దకు వచ్చి తీసుకెళ్లేవారు. ఈ ఏడాది ఆర్‌బీకేలు, పీపీసీ కేంద్రాలు, సివిల్ సప్లై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ధాన్యం కొన డం లేదు. టార్గెట్లు అయిపోయాయని అంటున్నారు. ఖరీఫ్‌లో పండించిన ధాన్యం అమ్మలేని పరిస్థితి. – బి.వెంకటరమణ, వాకలవలస, శ్రీకాకుళం మండలం
అపరాలు పండేంత వరకు..
జిల్లాలోని పలు మండలాల్లో ఫిబ్రవరి నెలాఖరు వరకు వరి నూర్చే పరిస్థితి లేదు. వరి చివరి కాలంలో ఆ పొలాల్లో మినుగులు, పెసలు వంటి అపరాలు పంటలు వేస్తారు. అవి పండేంత వరకు అక్కడే వరి కుప్పలు పెడుతున్నారు. అపరాలు పంటలు మార్చిలో చేతికి వస్తాయి. అప్పుడు వరి, అపరాలు రెండింటినీ నూర్పు యంత్రాల సాయంతో నూర్చడానికి చాలా మంది ప్రణాళిక వేసుకున్నారు. ప్రధానంగా నాగావళి, వంశధార తీరంలో ఉన్న మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ధాన్యం దళారులు భోజ్యం
Comments
Please login to add a commentAdd a comment