
జమ్మూకాశ్మీర్‌లో సిక్కోలు జవాన్ మృతి
వజ్రపుకొత్తూరు: మండలంలోని అమలపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నాయక్ బచ్చల తిరుపతిరావు(26) జమ్మూకాశ్మీర్‌లో మృతి చెందాడు. ఏకే–47 గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. అమలపాడుకు చెందిన బచ్చల వెంకటరావు, కామేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోవింద గ్రామంలోనే నివాసం ఉంటుండగా.. చిన్న కుమారుడు తిరుపతిరావు 2017లో ఆర్మీలో చేరాడు. తండ్రి వెంకటరావు సైతం బీఎస్‌ఎఫ్‌లో జవాన్‌గా విధులు నిర్వహించారు. తిరుపతిరావుకు ఇటీవలే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ముందుగా ఇల్లు నిర్మించాలని భావించి కొంతమేర అప్పులు చేశారు. తర్వాత వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లోని 8 ఆర్‌ఆర్ మద్రాస్ రెజిమెంట్ తరఫున ఈ నెల 4న ఎల్‌ఓసీ వద్ద తిరుపతిరావు విధులు నిర్వహిండగా ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం వినిపించింది. వెంటనే ఆర్మీ అధికారులు వెళ్లి పరిశీలించగా తిరుపతిరావు ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు గుర్తించారు. అయితే మృతికి గల కారణాలు నిర్ధారించలేదు. అప్పులు ఎక్కువైపోవడం, వచ్చిన జీతం మిగలకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు కూడా కారణం కావచ్చనని మరికొందరు చెబుతున్నారు. తిరుపతిరావు మృతదేహం గురువారం అమలపాడుకు రానుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.
ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు అనుమానాలు
స్వగ్రామం అమలపాడులో విషాదఛాయలు
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నేడు
Comments
Please login to add a commentAdd a comment