
అక్రమ వసూళ్లపై విచారణ పూర్తి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో కొందరు నిరుద్యోగులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు వ్యవహారంపై విచారణ పూర్తయింది. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయ డిప్యూటీ కమిషనర్ శోభారాణి విచారణాధికారిగా హాజరై బుధవారం పలువురు సిబ్బందిని విచారణ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న కృష్ణమాచార్యులుపై వచ్చిన అభియోగాలపై స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం కొందరు దినసరి వేతనదారులను పిలిపించి ఉద్యోగాల కోసం ఎవరికి డబ్బులు చెల్లించారో లిఖితపూర్వకంగా నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన ఈవో చంద్రశేఖర్, రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు తదితరుల సూచనల మేరకు తాము గతంలో కృష్ణమాచార్యులుపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చామని కొందరు దినసరి వేతనదారులు అంగీకరించినట్లు తెలిసింది. అలాగే విచారణకు హాజరైన కృష్ణమాచార్యులు మాట్లాడుతూ తాను నేరుగా ఎవరిదగ్గరా డబ్బులు వసూలు చేయలేదని చెబుతూనే కొందరు రెగ్యులర్ ఉద్యోగుల పీఆర్‌సీ వ్యవహారాల్లో తాను అడ్డుగా ఉన్నందున తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించి సస్పెన్షన్‌కు గురిచేయించినట్లు విచారణాధికారికి వెల్లడించారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ విషయంలో కూడా ఎలాంటి వసూళ్లు చేపట్టలేదని వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు బాధితుల నుంచి, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించామని, తుది నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు శోభారాణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment