ఇచ్ఛాపురం రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చనివాటిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అడ్డు తొలగించుకుంటున్నారు. మండలంలోని కొత్త శాసనం గ్రామంలో 30 ఏళ్ల క్రితం అప్పటి గ్రామపెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో సొంత నిధులతో రచ్చబండను నిర్మించాడు. రచ్చబండ మధ్యలో రావి చెట్టు, పక్కనే త్రినాథ స్వాములవారి విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామస్తులు వేసవి విడిది చేయడం, సమావేశాలు నిర్వహించడం, బాటసారులు విశ్రాంతి తీసుకోవడం చేస్తున్నారు. అయితే రచ్చబండకు వెనుకన స్థానిక టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరుకు చెందిన భూమి ఉంది. దీంతో స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతో తన భార్య జానికమ్మతో కలిసి బుధవారం గునపాలతో రచ్చబండను పెకిలించే ప్రక్రియకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అడ్డుకున్నవారి అంతు చూస్తానంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సర్పంచ్ కారంగి త్రినాథ్‌రెడ్డి తహసీల్దార్‌కు, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశాడు. రచ్చబండ ధ్వంసం చేసిన భాగాలకు మరమ్మతులు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రచ్చబండ తొలగింపునకు యత్నం