
అరసవల్లిలో విజిలెన్స్
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళ,బుధవారాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. మంగళవారం ఓ వైపు హుండీ కానుకల లెక్కింపు జరుగుతున్న క్రమంలో మరోవైపు కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టడం గమనార్హం. అయితే ఇప్పుడు విధుల్లో ఉన్న ఈవో కొత్తగా రావడంతో ఆయనకు గత నిధుల దుర్వినియోగంతో సంబంధం లేకున్నప్పటికీ సిబ్బందిలో మాత్రం ఆందోళన నెలకొంది. ప్పట్లో ఈవోలుగా పనిచేసిన రమేష్‌బాబు, చంద్రశేఖర్‌ల హయాంలో నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లుగా తెలిసింది. నిధుల దుర్వినియోగంలో గత ఈవో చంద్రశేఖర్‌కు ఆలయంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఈవో జగన్మోహనరావుతో పాటు మరో రెగ్యులర్ ఉద్యోగి, ముగ్గురు దినసరి వేతనదారులు చాలా వరకు సహకరించారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. డిప్యుటేషన్ విధుల్లో ఉన్న అటెండర్ శ్రీనివాస్‌కు ఎరియర్స్‌తో కూడిన పీఆర్సీని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టడాన్ని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గతంలో ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కృష్ణమాచార్యులు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగానే తాజాగా ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలను చేస్తున్నట్లు సమాచారం.
ప్రశ్నలకు సమాధానమేదీ.!
గత ఈవో చంద్రశేఖర్ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న నిధుల దుర్వినియోగాలపై విజిలెన్స్ అధికారులు స్థానిక ఆలయ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేనికీ సరైన రికార్డు లేకపోగా.. సమాధానం కూడా కరువైపోయి నీళ్లు నమలడమే తరువాయిగా మారింది.
వారినే అడగండి..
ముందుగా ఆలయ ఈవో అధికారిక వాహనం కొనుగోలు, వాహన ఇఽంధనం వినియోగ బాకీలు, కంప్యూటర్లు కొనుగోళ్లు, ఇతర సామగ్రి కొనుగోళ్లు, రూ.లక్షల బిల్లులతో పట్టుచీరలు, వస్త్రాల కొనుగోళ్లు, భక్తులకు ఇచ్చినట్లుగా చూపుతున్న మజ్జిగ, పాలు బిల్లులతో పాటు ఆలయానికి రంగులకు రూ.26 లక్షల వినియోగం.. ఇలా చాలావరకు ఆలయానికి చెందిన నిధులు దుర్వినియోగం అయినట్లు దాదాపుగా నిర్ధారణకు వచ్చిన విజిలెన్స్ అధికారులు.. ఈమేరకు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తే గత ఈవోలకు అడగండని సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నేరుగా ఫిర్యాదుదారుడు కృష్ణమాచార్యులతో ఫోన్లో సంప్రదించి.. అవసరమైతే ప్రత్యక్షంగా ఆధారాలు ఇస్తూ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా...విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు రికార్డులను, బిల్లులను తనిఖీలు చేస్తుంటే.. అప్పట్లో క్యాష్‌బుక్ బాధ్యుడిగా ఉన్న రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు మాత్రం విజిలెన్స్ అఽధికారులకు కనిపించకుండా రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే వెళ్లాలంటూ తాను మాత్రం తప్పించుకుని వెళ్లిపోయారు. దీన్ని విజిలెన్స్ సిబ్బంది ఒకరు గమనించి పెద్దాయన ఎందుకు వెళ్లిపోయారంటూ ప్రశ్నించడంతో పరిస్థితి మారిపోయింది. కంప్యూటర్ల కొనుగోళ్లు, సామగ్రి, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తులకు సౌకర్యాల కల్పన పేరుతో భారీగా నిధులు స్వాహా జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించి విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావుకు నివేదించనున్నట్లు తెలిసింది. దీనిపై ఆలయ అధికారులు గానీ సిబ్బంది గానీ ఎవ్వరూ నోరుమెదపడం లేదు. ఏదిఏమైనా ఆదిత్యుని ఆలయ నిధుల స్వాహా జరిగిందనే అభియోగాలు, ఆరోపణలపై త్వరలో తుది నివేదిక సిద్ధమై కారకులపై చర్యలు తీసుకోవచ్చనే చర్చ జోరందుకుంది.
వాస్తవమే..
ఈ విషయమై ఈఓ వై.భద్రాజీ వద్ద ప్రస్తావించగా మంగళ, బుధవారాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఆలయ రికార్డులు పరిశీలించగా, వారికి సహకరించామని చెప్పారు.