టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో వివిధ రకాల ఆశీలు హక్కుల కోసం శుక్రవారం నిర్వహించిన ఆశీల వేలం పాట సిండికేట్‌గా మారింది. అధికార పార్టీకు చెందిన కొందరు కార్యకర్తల కన్నుసన్నల్లో వేలంపాటదారులు సిండికేట్‌గా మారడంతో వేలం నామమాత్రంగా సాగింది. పంచాయతీ ఆశీల హక్కు కోసం ఆరంభంలో సర్కారు వారి పాటను రూ.13.92 లక్షలుగా ప్రకటించారు. అంతా సిండికేట్‌గా ఏర్పడి పాటను తగ్గించాలని అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో రూ. 12.70 లక్షలకు కుదించేశారు. చివరగా అధికార పార్టీ కార్యకర్తల డైరెక్షన్‌లో పట్టణానికి చెందిన పుచ్చకాయల రామిరెడ్డి అనే వ్యక్తి రూ.14 లక్షలకు రోజు వారీ మార్కెట్ ఆశీల వసూళ్ల హక్కును కై వసం చేసుకున్నారు. ఇదే వ్యక్తి రూ.77 వేలకు వారపు సంత, రూ.51 వేలకు బస్ అండ్ కారు స్టాండ్‌లో ఆశీల హక్కు దక్కించుకున్నారు. కమేళా హక్కును రూ.1,60,200కు జోగి ధర్మారావు కై వసం చేసుకున్నారు. కాగా, 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆశీల హక్కును దక్కించుకున్న జీరు వెంకటరెడ్డి పంచాయతీకి సుమారు రూ.7 లక్షల బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ జి.సుజాత, ఈఓపీఆర్‌డీ సింహాద్రి, ఇన్‌చార్జి ఈఓ శశిధర్ పాల్గొన్నారు.