
ఉపాధి బిల్లులు చెల్లించేదెన్నడు?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పన్నెండు వారాలుగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా జీవనం సాగిస్తారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ జనవరి 15 నుంచి నేటి వరకు ఉపాధి వేతనదారులు ఎండనక వాననక పనిచేస్తున్నా నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఎంపీలు, ఎమ్మె ల్యేలు జీతభత్యాలు లక్షలు రూపాయలు పెంచుకుంటున్నారే తప్పా ఉపాధి కూలీల బాధలు పట్టడం లేద న్నారు. పేదల ఓట్లతో అందలమెక్కుతున్న పెద్దలు ఉపాధి కూలీల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు శిర్ల ప్రసాద్, కె.ఎల్లయ్య, భవాని పాల్గొన్నారు.