ట్రాక్టర్లను పరిశీలిస్తున్న సీఎం పళనిస్వామి
సాక్షి, చెన్నై: కీల్పాకంలో పోలీసుల కోసం బహుళ అంతస్తులతో నిర్మించిన గృహాలను సీఎం పళనిస్వామి సోమవారం ప్రారంభించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రారంభోత్సవాల్లో సీఎం బిజీగా గడిపారు. చెన్నై పోలీసుల కోసం కీల్పాకం లూథర్స్ రోడ్డులో రూ.13 కోట్లతో వంద గృహాలను నిర్మించారు. అలాగే తిరువళ్లూరు పెరుంబాక్కం, సేలం మగుడం చావడి, తిరువణ్ణామలై పాచల్‌లలో రూ. 7 కోట్లతో నిర్మించిన మరో 43 గృహాలు, రూ. 3 కోట్లతో కృష్ణగిరి, రామనాథపురం జిల్లా వలినోక్కంలలో కొత్త పోలీసు స్టేషన్లు, సేలం వాలప్పాడిలో మహిళా పోలీసు స్టేషన్, తెన్ కాశిలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవనాలను సీఎం ప్రారంభించారు. సేలం ఆత్తూరు, తిరుచ్చి జయపురంలలో రూ. 1.22 కోట్లతో నిర్మించిన పోలీసు అధికారుల భవనాలతో పాటుగా మరెన్నో నిర్మాణాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు గృహ నిర్మాణ విభాగం తరఫున ప్రభుత్వానికి రూ. కోటి చెక్కును అధికారులు అందజేశారు. (తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్)
విద్యాశాఖకు రూ. 53 కోట్లతో భవనాలు
వేలూరు, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలి, తిరుపత్తూరులలో విద్యాశాఖ కోసం రూ. 53 కోట్లతో నిర్మించిన భవనాలు, కళాశాల అదనపు భవనాలు, తరగతి గదులను సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే వ్యవసాయ శాఖ కోసం రూ. 53 కోట్లతో సిద్ధం చేసిన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్ వర్తకం, సంతలు, మదురై, కళ్లకురిచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూర్, పుదుకోటై, ధర్మపురి, దిండుగల్‌లో నీటి సేకరణ, నిల్వ, పరిశోధనలకు సంబంధించిన కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా 23 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. మంత్రులు అన్బళగన్, కేసీ వీరమణి, నిలోఫర్ కబిల్, దురైకన్ను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment