
సూర్యాపేట 23వ వార్డులో కుక్కల దాడిలో గాయపడిన బాలుడు(ఇన్‌సెట్‌లో) కాలుకు గాయాలు
సూర్యాపేట: పల్లెలు, పట్టణాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. పగలు, రాత్రి వేళల్లో సైతం చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై పైశాచికంగా దాడి చేసి గాయపరుస్త్తున్నాయి. జిల్లాలోసూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలు, మారుమూల గ్రామాల్లో సైతం సుమారు 2లక్షలకుపైగా కుక్కులు ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేయాలని ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తోంది. అయినా అధికార యంత్రాంగం ఆ వైపుగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఘటనలు జరిగితేనే..
ఎక్కడైనా కుక్కల దాడిలో జంతువులుకాని, మనుషులు కాని మరణించిన సమయంలోనే వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేయాలని అధికారులకు గుర్తుకు వస్తుంది. మామూలు సమయంలో వీధుల్లో తిరుగుతున్న కుక్కలను పట్టి తీసుకెళ్లి మాత్రం ఆపరేషన్లు చేయాలన్న ఆలోచన మాత్రం రావడం లేదు. దీంతో రోజురోజుకూ కుక్కల సంఖ్య పెరిగిపోతూ వాటి దాడులతో జనం హడలిపోతున్నారు.
ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలు..
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క కాటుకు సంబంధించి యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచారు. కుక్క కాటుకు గురైన వారు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రుల్లోని టీకాలను వేయించుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం చేసి టీకాలు వేయించుకోకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
♦ వెంట పడి మరీ దాడులు చేసున్న వైనం
♦ తాజాగా సూర్యాపేటలో 15 మందిని గాయపర్చిన గ్రామసింహాలు
♦ ఘటనలు జరిగిందాకా స్పందించని అధికార యంత్రాంగం
కోదాడ పట్టణంలో సరిగ్గా రెండు నెలల క్రితం కుక్కలు దాడి చేసి నలుగురిని గాయపరిచాయి. అలాగే సూర్యాపేట పట్టణంలోనూ రెండు నెలల క్రితం నెహ్రూ నగర్‌లో కుక్కల దాడిలో ఇద్దరు చిన్నపిల్లలు గాయపడ్డారు. తాజాగా శుక్రవారం సూర్యాపేటలోని 23వ వార్డులోని వివిధ ప్రాంతాల్లో శునకాల దాడిలో సుమారు 15 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇలా జిల్లాలో నెలకొన్న కుక్కల బెడదతో పల్లెలే కాదు.. పట్టణాల వాసులు కూడా బెంబేలు చెందుతున్నారు. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒకచోట జనంపై కుక్కల దాడి జరుగుతూనే ఉంది.
రాత్రి సమయంలో ప్రజలు తమ పనులు ముగించుకని ఇంటికి వస్తున్న సమయంలో వీధుల్లో తిరుగుతున్న కుక్కలు వెంట పడి మరీ దాడి చేస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్లేవారినే కాకుండా వాహనాలు, బైక్‌ల మీద రాకపోకలు సాగించే వారి వెంటబడి దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక వాహనదారులైతే భయపడుతూ వాహనాలను నడపడంతో అదుపుతప్పి కిందపడి గాయాల పాలైన ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.

శునకానికి సంతాన నిరోధక ఆపరేషన్ చేస్తున్న వైద్యుడు

Comments
Please login to add a commentAdd a comment