ఆయకట్టు ఎండుతోంది..
ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు అందని గోదావరి జలాలు
సూర్యాపేట : అడుగంటిన భూగర్భ జాలలు.. వట్టిపోయిన బోర్లు.. నీటిపారుదల శాఖ అధికారుల ఉదాసీనత.. అరకొరగా విడుదల చేసిన నీరు అందకపోవడం.. వెరసి ఎస్సారెస్పీ ఆయకట్టులో వరిపొలాలు ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి యాసంగిలో సాగు చేసిన పంట ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎండిపోయిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. ఈ ఆయకట్టు కింద 2.20లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నా సాగు 50వేల ఎకరాలు కూడా దాటలేదు.
ఎస్సారెస్పీ రెండో దశ కింద..
శ్రీరాంసాగర్ రెండోదశ కింద సూర్యాపేట జిల్లాలో 2.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరందించేందుకు 69, 70, 71 డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ మేజర్)లు ఉన్నాయి. ఇందులో 71 డీబీఎం పెద్దది. 69 డీబీఎం తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో 27కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. దీనికింద 60,572 ఎకరాల ఆయకట్టు ఉంది. 70 డీబీఎం నాగారం, తిరుమలగిరి మండలాల్లో 9కి.మీ మేర విస్తరించి ఉంది. దీనికింద 7వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 71డీబీఎం తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్, మోతె, మునగాల, నడిగూడెం మండలాల్లో 68.45కి.మీ మేర విస్తరించి ఉంది. దీనికింద 1,42,230 ఎకరాల ఆయకట్టు ఉంది.
ప్రధాన కాలువల వెంటనే సాగు..!
69వ డీబీఎం కింద 60వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. 28 ఉపకాల్వలు, 70వ డీబీఎం కింద 7వేల ఎకరాలకు గాను 11 ఉపకాలువలు ఉన్నాయి. ఇక 71 డీబీఎం కింద 1,41,230 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. 75 ఉపకాలువలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాకు వదులుతున్న గోదావరి జలాలు ప్రధాన కాలువలు తప్పా ఎక్కడా ఉపకాలువల్లోకి వెళ్లని పరిస్థితి. నీటి విడుదల మొదలు ఇదే పరిస్థితి ఉండడంతో చాలామంది రైతులు సాగు చేయలేదు. దీంతో కేవలం 50వేల నుంచి 60వేల ఎకరాల్లోనే సాగు చేశారు. కొందరు కొద్దిపాటి బోరుబావుల కింద ఈ నీటిని నమ్ముకుని సాగు చేసినా ప్రస్తుతం ఆ పొలాలు ఎండిపోయే దశకు చేరాయి. గతంలో రోజుకు 1800 నుంచి 1900 క్యూసెక్యుల నీటిని రెండోదశకు విడుదల చేసేవారు. దీంతో మూడ్రోజుల్లోనే చివరి ఆయకట్టు భూములకు ఈ నీరు చేరి కొన్నిచోట్ల మండు వేసవిలోనూ చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. కానీ ప్రస్తుతం 1400 క్యూసెక్యులకు మించి ఇవ్వడం లేదు. దీంతో ఏ డీబీఎంలోనూ చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. జనవరి 1వ తేదీ నుంచి జిల్లాకు నీటిని విడుదల చేస్తుండగా.. ఇంతవరకు 71 డీబీఎం పరిధిలోని మోతె, నడిగూడెం మండలాల చివరి భూములకు నీరు చేరనేలేదు. అసలు పైభాగంలో ఉన్న అర్వపల్లి మండలంలోనూ పంటలు ఎండిపోతున్నాయంటే ప్రభుత్వం ఏ మేరకు నీటిని విడుదల చేస్తుందో అర్థం చేసుకోవచ్చని రైతాంగం చర్చించుకుంటోంది.
పంట చేతికి వస్తుందో రాదో తెలియడం లేదు
కొద్దిపాటి బోర్లతో పాటు ఎస్సారెస్పీ నీటిని నమ్ముకొని రెండు ఎకరాలు సాగు చేశాను. ప్రస్తుతం పొలం కరకు దశలో ఉంది. నీళ్లు ఇప్పుడే అవసరం. ఎండలు ముదిరాయి. ఎస్సారెస్పీ నీళ్లు రావడం లేదు. పంట చేతికి వస్తుందో రాదో తెలియదు.
అబ్బ గాని మల్లయ్య, రైతు, ఆత్మకూరు
ఫ ఎండలు ముదిరి నీటి వాడకం పెరగడంతో ఎండుతున్న పొలాలు
2025 జనవరినాటికి ఎస్సారెస్పీ
ఆయకట్టు మండలాల్లో భూగర్భ జలాలు
మండలం మీటర్లలోతుల్లో
తిరుమలగిరి 16.71
తుంగతుర్తి 4.15
మద్దిరాల 4.09
నూతనకల్ 3.77
నాగారం 1.55
అర్వపల్లి 7.82
సూర్యాపేట 5.99
ఆత్మకూర్ 6.84
చివ్వెంల 4.58
పెన్‌పహాడ్ 5.48
మోతె 2.59
మునగాల 5.24
నడిగూడెం 3.80
ఫ నామమాత్రపు నీటి విడుదలతో
50వేల ఎకరాలు దాటని వరి సాగు
ఆయకట్టుపై పట్టింపేది..?
కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు కరువయ్యాయని రైతాంగం భావిస్తోంది. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి రాగా కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే నీరిచ్చారు. ఇక 2024 వానాకాలం సీజన్‌లో పుష్కలంగా నీరున్నా ఆలస్యంగా నీటిని విడుదల చేశారు. దీంతో చివరి ఆయకట్టుతో పాటు చాలామంది రైతులు పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. 2024 నవంబర్ మాసంలో శ్రీరాంసాగర్‌తో పాటు మిడ్ మానేరు, ఎల్‌ఎండీల్లోకి వరద వచ్చి గేట్లను సైతం ఎత్తారు. దీంతో వానాకాలం ఆలస్యమైనా యాసంగికి పుష్కలంగా నీళ్లొస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అయినా అటు పాలకులు, ఇటు నీటిపారుదల శాఖ అధికారుల తీరుతో 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాంతానికి నీటిని విడుదల చేయడంలో పట్టింపు లేకుండా ఉన్నారు.
ఆయకట్టు ఎండుతోంది..
ఆయకట్టు ఎండుతోంది..
Comments
Please login to add a commentAdd a comment