నెలవారం.. జనహారం
ఫ భక్తిశద్ద్రలతో ప్రత్యేక పూజలు
ఫ కేసారం చేరిన దేవరపెట్టె
ఫ నేడు జాతర ముగింపు
చివ్వెంల, సూర్యాపేటటౌన్ : పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో నాలుగోరోజు కూడా భక్తుల కోలాహలం నెలకొంది. బుధవారం నెలవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. లింమంతుల స్వామిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ సందర్శించి పూజలు చేశారు. గురువారం మకరతోరణం తరలింపుతో జాతర ముగియనుంది.
దేవరపెట్టె తరలింపు
జీవాలను పరిరక్షించిన దేవతగా అవతరించిన చౌడమ్మతల్లికి పూజలు చేశారు. మంగళవారం చంద్రపట్నం వేసి పూజలు నిర్వహించి నిద్ర ఘట్టంలో భాగంగా కేసారం చేరిన పూజారులు బుధవారం కొత్త బోనం కుండ, గంపలో పూజా సామగ్రి, తొలిగొర్రెను తోలుకొని గట్టుకు చేరుకున్నారు. చంద్రపట్నంపై ఉన్న దేవరపెట్టె వద్ద పూజలు చేశారు. మున్న, మెంతబోయిన వంశీయులు కొత్త కుండలో బోనాలు వండారు. లింగమంతులు, చౌడమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టారు. మెంతబోయిన వంశీయులు తెచ్చిన తొలిగొర్రెను పట్నంపై బలి ఇచ్చారు. ఈ తంతు జరుగుతుండగా మరో వైపు బైకాన్ల కథలు చెప్పడంతో దేవాలయం ఉర్రూతలూగింది. ఆ తర్వాత మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం బైకాన్లకు, మరో భాగం మున్న వంశీయులకు ఇచ్చారు. మిగిలిన భాగం మెంతనబోయిన వంశీయులు వంట చేసి ప్రసాదంగా తీసుకున్నారు. అనంతరం చంద్రపట్నం ఎత్తిపోసి సమీపంలోని నాగులమ్మ పుట్టలో పోశారు. తర్వాత చౌడమ్మ, లింగమంతుల విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను తీసుకొని మెంతనబోయిన, గొర్ల వంశీయులు సూర్యాపేట మండలం కేసారం బాటపట్టారు. దీంతో నెలవారం పండుగ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.
నేడు ముగియనున్న జాతర..
నాలుగు రోజులుగా లక్షలాది భక్తుల పూజలు అందుకున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర గురువారంతో ముగియనుంది. సూర్యాపేట యాదవ బజార్ నుంచి గట్టుకు తెచ్చిన మకర తోరణం గురువారం స్వస్థలానికి చేరనుంది. మకర తోరణం తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుందని యాదవ పూజారులు తెలిపారు.
నెలవారం.. జనహారం
Comments
Please login to add a commentAdd a comment